ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టి దాడులకు ప్రయత్నిస్తున్న నాలుగు దేశాలు?..

ఇళ్లలోకి, వీధుల్లోకి, పండుగ కోసం బయటకు వచ్చిన జనాల మధ్యకి చొచ్చుకొచ్చిన హింస.. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ అంతా ఒక భయంకరమైన షాక్‌లోకి జారిపోయింది.

ప్రపంచం టీవీ తెరల ముందు కూర్చుని ఆ దృశ్యాలను చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు మొదలైన యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యం ఇప్పటికీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్‌ను వెంటాడుతున్న భయం అక్టోబర్ 7 జ్ఞాపకం గురించి మాత్రమే కాదండి.. అదే స్థాయి షాక్ మరోసారి వస్తుందేమోననే టెన్షన్‌ ఆ దేశంలో కనిపిస్తోంది.

ఈసారి మరింత పెద్ద రూపంలో వస్తే ఎలా ఉంటుందన్న భయం నెలకొంది. హమాస్ ఒక్క వైపు నుంచి దాడి చేసిన ఆ రోజు ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పుడు ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న అనేక సాయుధ గ్రూపులు ఒకేసారి కదిలితే? ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న నాలుగు దిశలు ఒకేసారి యుద్ధభూములుగా మారితే? ఉత్తరాన లెబనాన్‌లో హిజ్బుల్లా ఉంది. దక్షిణాన గాజాలో హమాస్ ఉంది. సముద్రం అవతల యెమెన్‌లో హౌతీలు ఉన్నారు. మరోవైపు ఇరాక్‌లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న సాయుధ గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా కదిలితే ఒక కథ.. ఒకేసారి కదిలితే మరో కథ. ఇజ్రాయెల్‌కు ఇప్పుడు భయపెడుతున్న అంశం అదే…అక్టోబర్ 7న ఏం జరిగిందో ప్రపంచం చూసింది. ఒకే దిశ నుంచి వచ్చిన ఆకస్మిక దాడి ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలదో ఆ రోజు నిరూపించింది. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఇరాన్ తన మిత్ర సాయుధ గ్రూపులతో కలిసి మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి.

హిజ్బుల్లా కమాండర్లతో ఇరాన్ కుద్స్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతున్నట్టు.. హౌతీలు, ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల గ్రూపులతో కూడా సమన్వయం జరుగుతున్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి. ఒక వైపు గాజా.. మరో వైపు లెబనాన్.. దూరంగా యెమెన్.. ఇరాక్ వైపు నుంచి మరో ముప్పు.. ఇలా ప్రతి దిశలో ఒక యుద్ధపు నీడ నిలబడితే ఇజ్రాయెల్ మధ్యలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడొచ్చు. అదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య కూడా మళ్లీ మంటలు రేగుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ చమురు రవాణాపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచానికి కీలకమైన సముద్ర మార్గం కూడా యుద్ధపు నీడలోకి వెళ్లిపోయింది. ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని తిరిగి పెంచుకుంటున్నట్టు సమాచారం..