టెహ్రాన్‌ దాడి….ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య భీకర యుద్ధం…

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్‌ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్‌ ప్రతిస్పందన దాడులు మొదలుపెట్టింది…టెల్‌ అవీవ్‌, జెరూసలెం లక్ష్యంగా మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఆయా ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ క్షిపణి దాడులు చేపట్టింది. మరోవైపు వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌ ఇంటర్‌సెప్టార్‌ కిపణులను ప్రయోగించింది. ఇరాన్‌ చేపట్టిన మిసైల్‌ దాడుల్లో టెల్‌ అవీవ్‌, జెరూసలెంలో పలుచోట్ల బాంబులు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇరాన్‌ దాడులతో ఇజ్రాయెల్‌ భూభాగంలో సైరన్లు మోగాయి. తమ పౌరులే లక్ష్యంగా టెహ్రాన్‌ దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది. ప్రస్తుతం తమ పౌరులకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌ అంతటా డజన్లకొద్దీ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. మరోవైపు రెండు ఇజ్రాయెల్‌కు చెందిన ఫైటర్‌ జెట్‌లను కూల్చినట్లు ఇరాన్‌ తెలపగా, ఇజ్రాయెల్‌ ఆ వార్తలను తోసిపుచ్చింది. ఇరాన్‌ 100కు పైగా క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అయితే వాటిలో చాలా వాటిని లక్ష్యాన్ని చేరకముందే కూల్చినట్లు తెలిపింది.

24 గంటల్లోపే మళ్లీ దాడులు చేపట్టిన ఇజ్రాయెల్‌

ఇరాన్‌ దాడులు చేపట్టకముందు శుక్రవారం రాత్రి ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మరోసారి దాడులకు దిగింది. అణు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఇస్ఫహాన్‌ అణుస్థావరంపై విరుచుకుపడ్డట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై దాడిచేసినట్లు తెలిపింది. ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌లు ఇస్ఫహాన్‌ ప్రాంతంలోని అణుస్థావరంపై విరుచుకుపడి లక్ష్యాలను ఛేదించినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. ఈ ప్రాంతంలో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతోన్నట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ వెల్లడించింది. యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఇస్ఫహాన్‌లోని అణుస్థావరాలు ఉన్న నిర్మాణాలను ఎక్స్‌లో పోస్టు చేసింది. తమ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలు ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం అయినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. అవసరమైనంత మేరకు మళ్లీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్‌ తెలిపింది.

ఇరాన్‌ ప్రయోగించిన మిసైళ్లను అడ్డుకుంటున్న ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌.

ఇరాన్‌ నాయకత్వంపై తిరుగుబాటుకు పిలుపునిచ్చిన నెతన్యాహు..

టెల్‌అవీవ్‌, టెహ్రాన్‌ మధ్య తీవ్రమైన దాడులు చోటుచేసుకుంటున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ నాయకత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకొని ఇరాన్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలని పేర్కొన్నారు. ఈ సమయంలో తాను, ఇజ్రాయెల్‌ ప్రజలు మీకు మద్దతుగా ఉంటారని తెలిపారు. మరోవైపు టెహ్రాన్‌ హద్దు మీరుతోందని, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రి యోవ్‌ గాల్లంట్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

ఆరుగురు టాప్‌ మిలిటరీ కమాండర్స్‌ మృతి.. ఐడీఎఫ్‌

ఇజ్రాయెల్‌ శుక్రవారం చేపట్టిన దాడుల్లో మొత్తం ఆరుగురు టాప్‌ మిలిటరీ కమాండర్స్‌, తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ డెఫ్రిన్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. చనిపోయిన వారిలో ఇరాన్‌ మిలిటరీ స్టాఫ్‌ చీఫ్‌ మహమ్మద్‌ బఘేరీ, ఐఆర్‌జీసీ అధిపతి హొస్సేన్‌ సలామీ, ఖటమ్‌ అల్‌ అన్‌బియా సెంట్రల్‌ హెడ్‌క్వార్టర్స్‌ హెడ్‌ ఘోలమ్‌ అలీ రషీద్‌, ఐఆర్‌జీసీ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ అమిర్‌ అలీ హజిజాదె, ఐఆర్‌జీసీ ఎయిర్‌ఫోర్స్‌ డ్రోన్‌ యూనిట్‌ కమాండ్‌ తాహెర్‌ పౌర్‌, ఐఆర్‌జీసీ ఎయిర్‌ ఫోర్స్‌ డిఫెన్స్‌ యూనిట్‌ కమాండర్‌ దావోద్‌ షేఖియాన్‌ ఉన్నారు.

ఇరాన్‌ క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా సాయం!…

టెహ్రాన్‌ చేపట్టిన మిసైళ్ల దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం చేసినట్లు అమెరికా అధికారి తెలిపారు. యాక్సియోస్‌ మీడియాకు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. మరోవైపు ఇరుదేశాల పరస్పర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది.

ఇజ్రాయెల్‌ దాడులను ఖండించిన పుతిన్‌..

ఇజ్రాయెల్ దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఖండించారు. ఇరాన్‌ న్యూక్లియర్‌ ప్రొగ్రామ్‌ను రాజకీయ, దౌత్య పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పుతిన్‌ రెండు దేశాల అధినేతలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను పుతిన్‌ ఖండించినట్లు పేర్కొంది. యూఎన్‌ చార్టర్‌ను ఇది ఉల్లంఘించడమేని పేర్కొన్నారు. ఇరాన్‌ అధికారుల మృతికి పుతిన్‌ సంతాపం తెలిపినట్లు క్రెమ్లిన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్‌, సౌదీ యువ రాజు

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ పరస్పర దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, బ్రిటన్‌ ప్రధాని కేర్‌ స్టార్మర్‌ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో స్థిరత్వ సాధన, ఉద్రిక్తతలను తగ్గించడం, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కారంపై వీరు చర్చించారు…