జమ్మూకాశ్మీర్ లో భారీ విధ్వంసానికి పాక్ కుట్ర పన్నిందా? వేలాది మంది ఉగ్రవాదులను సరిహద్దులు దాటించిందా? అంటే నిజమనే అంటున్నాడు పాక్ మత ప్రబోధకుడు నాసిర్ మద్నీ (Nasir Madni). నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఓ కార్యక్రమంలో తాజాగా పాల్గొన్న ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.. జమ్మూ కాశ్మీర్ లోకి ఏకంగా 10,000 మంది ఉగ్రవాదులను పంపాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు భారత్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి…
బహావుల్నగర్ సభలో ప్రకటన.
పాకిస్తాన్లోని బహావుల్నగర్ (Bahawalnagar) లో నిర్వహించిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కార్యక్రమంలో నాసిర్ మద్నీ ప్రసంగించాడు. ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన కోలుకున్న తర్వాత మొదటిసారిగా ఈ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సయీద్ను ప్రశంసిస్తూ ఆయన తన మాతృభూమి కోసం ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడాడు. ఇదే క్రమంలో కాశ్మీర్ లోయలోకి సయీద్ 10,000 మంది ముష్కరులను పంపాడని వ్యాఖ్యానించాడు. ఈ సంఖ్యకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. కాశ్మీర్లో ఉగ్రవాద వ్యాప్తికి సయీద్ ఇంకా కుట్రలు చేస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది..