జమ్మూకశ్మీర్‌లో ఘోరం.. జవాన్‌లతో సహా 33 మంది మృతి.. 220 మందికి పైగా గల్లంతు..!

Jammu Kashmir Kishtwar Cloudburst: జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌లోని చోసిటి గ్రామంలో గురువారం భారీ మేఘాల విస్ఫోటం(క్లౌడ్‌బరస్ట్‌) సంభవించిన విషయం తెలిసిందే. దీంతో సంభవించిన ఆకస్మిక వరదలు, పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు ఇద్దరు CISF జవాన్లు సహా కనీసం 33 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను కాపాడేందుకు కోసం రెస్క్యూ బృందాలు పరుగులు తీస్తున్నాయి. 220 మందికి పైగా ప్రజలు గల్లంతయినట్లు తెలుస్తోంది. హిమాలయలోని మాతా చండి పుణ్యక్షేత్రానికి వెళ్లే మచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ విపత్తు సంభవించింది. దీంతో భారీ వరదలు సంభవించాయి. ఈ ఘటనలో మరణించిన భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. క్లౌడ్ బరస్ట్ తో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది…
Jammu & Kashmir Kishtwar Cloudburst: 33 Dead, 220 Missing in Flash …
సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఆలయం…

కిష్ట్వార్ లో సంభవించిన మెరుపు వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మచైల్ మాతా ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్ము డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వచ్చారు. సెప్టెంబర్ 5న ఈ యాత్ర ముగియనుంది.

మెరుపు వరదల ఘటనలో 220 మంది యాత్రికులు గల్లంతయ్యారు. 120 మంది గాయపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి.

వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం యాత్రను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కిష్త్వార్ ప్రాంతంలో పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించానని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు..

ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు. అవసరమైన వారికి సాధ్యమైన ప్రతి సాయం అందించబడుతుందన్నారు…

ఎలా జరిగింది ఈ విపత్తు?..

కిష్త్వార్ జిల్లాలోని చోషోటి గ్రామం పర్వతాల మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంతం మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఉండటంతో ఎప్పుడూ యాత్రికుల రాకపోకలు ఉంటాయి. అయితే, బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఆ మేఘాలు కాసేపు పర్వతాలపై నిలిచి, అకస్మాత్తుగా విరిగిపోయాయి. క్లౌడ్ బర్స్ట్ వల్ల వచ్చిన నీటి మోత, మట్టితో కలిసిపోయి ఒక రాకసంలా దూసుకొచ్చింది. రహదారులు, చిన్నపాటి దుకాణాలు, యాత్రికుల తాత్కాలిక శిబిరాలు అన్నీ క్షణాల్లో కొట్టుకుపోయాయి…