కాశ్మీర్‌కు రైలు. 132 ఏళ్ల కల.. మోడీ చేతుల మీదుగా నేడు చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ ప్రారంభం…….

చినాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూకశ్మీర్‌ పురోగతికి ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా..

Jammu & Kashmir’s development.

.కశ్మీర్‌లో అభివృద్ధిని ఆపలేరన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి కశ్మీర్‌ లోయలో పర్యటించిన ప్రధాని.. ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా నిలిచిన చినాబ్‌ వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ (PM Modi) మాట్లాడుతూ.. పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పునరుద్ఘాటించారు.

”మన పొరుగు దేశం పర్యాటకానికి, మానవత్వానికి వ్యతిరేకం. మన పర్యాటకాన్ని దెబ్బతీసి పేదల పొట్టగొట్టాలని చూస్తోంది. ఆదిల్‌ హుస్సేన్‌ గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీవాలా. తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడే అతడు.. ఆ రోజు ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడు. అతడినీ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. పాక్‌ కుయుక్తులను భారత్‌ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. ఉగ్ర కుట్రలకు దీటుగా బదులిస్తున్నాం. కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలని పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమాయక ప్రజల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌తో మన శక్తి ఏంటో చూపించాం. సరిగ్గా నెల రోజుల క్రితం పొరుగు దేశంలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం. పాక్‌ నాయకత్వానికి నిద్ర లేకుండా చేశాం. ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకోలేరు” అని మోదీ పునరుద్ఘాటించారు.

8వ తరగతిలో ఆ సీఎం కల.. మేం నేరవేర్చాం..

”ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తైన వంతెనను నిర్మించుకున్నాం. భారత ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి చినాబ్‌ బ్రిడ్జ్‌ (Chenab bridge) ఓ ప్రతీక. ఈ వంతెన నిర్మాణంతో ఈ ప్రాంతం పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ బ్రిడ్జ్‌ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా.. మాతా వైష్ణోదేవి ఆశీర్వాదంతో ఇది సాధ్యమైంది. ఈ రోజుతో భారత రైల్వే నెట్‌వర్క్‌తో కశ్మీర్‌ కూడా అనుసంధానమైంది. ఇక కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి అనేది వాస్తవ రూపంలోకి వచ్చినట్లయ్యింది. ఈ రోజు కోసం అనేక తరాలు ఎదురుచూశాయి. సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా 8వ తరగతి నుంచే ఈ ప్రాజెక్ట్‌ కోసం కలలు కన్నారు. ఇప్పుడు భాజపా ప్రభుత్వం దాన్ని నెరవేర్చింది” అని ప్రధాని మోదీ తెలిపారు….

చీనాబ్‌ విశేషాలు..

చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్‌ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది……46,000 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టులతోపాటు, ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఊతమిచ్చిందని ప్రధాని అన్నారు. ఈ ప్రాజెక్టు అనేక సవాళ్లను అధిగమించిందని, ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంకల్పం, నిబద్ధత వల్ల సాకారమైందని ఆయన ఉద్ఘాటించారు. ఈ రైలు మార్గం కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో మరింత సమీపంగా చేస్తుందని, ఇదే సమయంలో పర్యాటకం, వాణిజ్యం, ఆర్థికవృద్ధికి ఊతమిస్తుందని మోదీ పేర్కొన్నారు…

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కశ్మీర్‌ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఏర్పడింది.
భూకంపాలు, గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల్ని తట్టుకోగల ఈ వంతెన జీవితకాలం 120 ఏండ్లు.
ఆర్చ్‌ ఆకృతిలో నిర్మించిన ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తు ఎక్కువ.
నదీగర్భం నుంచి ఈ బ్రిడ్జి 1,178 అడుగుల ఎత్తులో ఉంది.
వంతెన నిర్మాణం కోసం 28 వేల టన్నుల స్టీల్‌, 6 లక్షల బోల్ట్‌లు వాడారట.
నిర్మాణ వ్యయం రూ.1483 కోట్లు.
వంతెనకు ఇరువైపులా 93 డెక్‌ సెగ్మెంట్స్‌ను ఉపయోగించగా, ఒక్కోటి 85 టన్నుల బరువు ఉంటుందట.
ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ వంతెన జాతి సమగ్రత, ఇంజినీరింగ్‌ అద్భుతానికి ఓ చిహ్నం..

పాకిస్తాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్..

భారత్‌ దాడులతో పాక్‌ వణికిపోయింది. పక్కాగా చేసిన స్ట్రైక్స్‌తో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులను క్షమించం అనే సందేశం పంపాం. 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. భారత్‌ ఈ స్థాయిలో దాడి చేస్తుందని పాకిస్థాన్‌ ఊహించలేకపోయింది. మనం ఉగ్ర స్థావరాలను టార్గెట్‌ చేస్తే.. పాక్‌ మన ప్రజలను, ఆలయాలను టార్గెట్‌ చేసింది. పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పేందుకు జమ్ముకశ్మీరీలు సిద్ధంగా ఉన్నారు” అని ప్రధాని మోదీ అన్నారు…..ప్రధాని మోదీ తన ప్రసంగంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా విమర్శించారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతి, పురోగతిని అడ్డుకునేందుకు పాకిస్థాన్ నిరంతరం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడి వంటి చర్యలు కాశ్మీర్‌లోని పర్యాటక రంగాన్ని, స్థానికుల జీవనోపాధిని నాశనం చేసే లక్ష్యంతో జరిగాయని అన్నారు. అయినప్పటికీ, కాశ్మీర్ ప్రజల స్థితిస్థాపకత, దేశ ప్రజల ఐక్యత ఈ దాడులను తిప్పికొట్టాయని వెల్లడించారు. పహల్గామ్‌లో దాడి కేవలం పౌరులపై జరిగింది మాత్రమే కాదన్నారు. ఈ దాడి భారతదేశంలో అల్లర్లు రెచ్చగొట్టి, శాంతిని అస్థిరపరచాలనే లక్ష్యంతో జరిగిన వ్యూహాత్మక చర్య అని మోదీ వ్యాఖ్యానించారు…