జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ.

రాకేష్ వర్రే-వైశాలి-రియా సుమన్-సుబ్బరాజు-ఛత్రపతి శేఖర్- రవిప్రకాష్- బలగం సుధాకర్ రెడ్డి తదితరులు..

దర్శకత్వం: విరించి వర్మ

నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి.

సినిమాటోగ్రఫీ: వి. ఎస్. జ్ఞాన శేఖర్

సంగీతం: గోపి సుందర్

సహ నిర్మాత: ఉమ రవీందర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు

చిన్నతనంలో జగిత్యాలలో జరిగిన ఓ సంఘటనతో జితేందర్ రెడ్డి (రాకేశ్ వర్రే) ప్రజల కోసం బతకాలనే కోరికతో పెరుగుతాడు. తనకు స్పూర్తిని రగిలించిన జాతీయ భావాలున్న గొపన్న (సుబ్బరాజు), రామన్నను ఆదర్శంగా తీసుకొని వామపక్ష భావజాలం ఉన్న వారితో పోరాటం చేస్తుంటాడు. కాలేజీలో లెఫ్ ఆధిపత్యానికి గండి కొడుతాడు. అలాగే నక్సలైట్ ఉద్యమానికి ఎదురుగా నిలబడుతాడు. ఇలా అతడు ప్రజలతో మమేకం అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుంది.

చిన్నతనంలో జితేందర్ రెడ్డి ఆలోచన విధానాన్ని మార్చి వేసిన సంఘటన ఏమిటి? గోపన్న, రామన్న జీవితాలను ఎలా స్పూర్తిగా తీసుకొన్నాడు? కాలేజీలో లెఫ్ట్ పార్టీ స్టూడెంట్ యూనియన్లపై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? నక్సలైట్లను జగిత్యాల గడ్డపై అడుగుపెట్టకుండా ఎలా అడ్డుకొన్నాడు? స్థానిక ఎమ్మెల్యేను ఎలా ఎదిరించాడు? జితేందర్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా సాగింది? ఎమ్మెల్యే టికెట్ లభించిన తర్వాత ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలాయి? నక్సలైట్లపై జితేందర్ రెడ్డి ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నారు లేదా నక్సలైట్లే ఆయనపై ఎలాంటి తిరుగుబాటు చేశారు? జితేందర్ రెడ్డి జీవితానికి ముగింపు ఏమిటనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైన చూడాల్సిందే.

కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతాన్ని నక్సలైట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న రోజుల్లో జితేందర్ రెడ్డి ప్రాణాలకు తెగించాడనే పాయింట్‌ను కథగా విస్తరించే విషయంలో దర్శకుడు విరంచి వర్మ పూర్తిగా పట్టు సాధించలేడనే విషయం కనిపిస్తుంది. కాకపోతే కొన్ని సీన్లను చాలా ఎమోషనల్‌గా రాసుకోవడమే కాకుండా తెరపైన భావోద్వేగాన్ని పండించడంలో సఫలమయ్యారు. గోపన్న, రామన్న హత్య ఎపిసోడ్, అలాగే గట్టయ్య క్యారెక్టర్ ద్వారా కథను చెప్పడం బాగుంది.

అయితే జితేందర్ రెడ్డి ఫస్టాఫ్ క్యారెక్టర్ల ఎంట్రడక్షన్, అలాగే కథను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికే ఎక్కువ సమయం తీసుకోవడంతో కొంత నింపాదిగా సాగినట్టు అనిపిస్తుంది. అలాంటి లోపాన్ని సెకండాఫ్‌లో దర్శకుడు విరించి వర్మ సవరించుకొని.. మంచి యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. 80, 90వ దశకంలోని వాతావరణాన్ని తెరమీద చూపించే విషయంలో దర్శకుడు ఫర్యాలేదనిపిస్తారు. క్లైమాక్స్‌లో యాక్షన్ ఎపిసోడ్ అదరగొట్టేలా తీశాడు. ఆ సమయంలో చత్తీస్ గఢ్ అనేదే లేదు. ఇలాంటి చిన్న చిన్న తప్పులను సరిచూసుకొంటే బాగుండేదనిపిస్తుంది.

జితేందర్ రెడ్డి సినిమా కథపరంగా, నిర్మాణ విలువల పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. రాకేశ్ వర్రే తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయాడనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక గోపన్నగా సుబ్బరాజు,గట్టయ్యగా రవి ప్రకాశ్ సినిమాకు హైలెట్‌గా నిలిచారు. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు…

కథః
జితేందర్‌ రెడ్డి(రాకేష్‌ వర్రే) అలియాస్‌ జిత్తన్న తండ్రి ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలకంగా పనిచేస్తుంటారు. ఆయన నేర్పిన ఆశయాలను, పాఠాలను బాగా వంటపట్టించుకుంటాడు జితేందర్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం అప్పుడప్పుడే పెరుగుతుంది. బీజేపీ సైతం బాగా యాక్టివ్‌గా మారిన రోజులు. అదే సమయంలో నక్సల్‌ ప్రభావం కూడా బాగానే ఉంది.

తెలంగాణలో ఆ ప్రభావం మరింతగా ఉంది. నక్సల్‌ అనుబంధ స్టూడెంట్‌ యూనియన్‌ ప్రభావం కాలేజీలు, యూనివర్సిటీల్లో మరింతగా ఉంది. ఆ సమయంలో జిగిత్యాల ప్రభుత్వ కాలేజీలో అప్పటికే పీడీఎస్‌యూ(సినిమాలో యూనియన్లు, నాయకుల పేర్లు మార్చారు) హవా నడుస్తుంది. బంద్‌లతో హల్‌చల్‌ చేస్తుంటారు. దీంతో వారికి వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకుడిగా ఎదిగాడు జితేందర్‌. అప్పటి వరకు నక్సల్‌ యూనియన్‌ ప్రభావంతో కాలేజీ మొత్తం హడలిపోతున్న నేపథ్యంలో జితేందర్‌ రెడ్డి రాకతో వారికి వణుకు పుడుతుంది.

జగిత్యాల ప్రాంతంలోని ఊర్లలోనూ జనం కూడా నక్సల్‌కి అనుకూలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారిలో మార్పు తీసుకొస్తాడు. తనే స్వయంగా రంగంలోకి దిగి నక్సల్స్ అంతం కోసం పనిచేస్తుంటాడు. పోలీసులు చేయలేనిది తను చేసి చూపిస్తాడు. ఈ క్రమంలో తనకు నక్సల్స్ నుంచి ప్రాణహాని పొంచి ఉంది. అయినా దాన్ని లెక్కచేయకుండా తన ఆశయం కోసం పనిచేస్తుంటాడు.

ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటాడు జితేందర్‌ రెడ్డి. స్టూడెంట్‌ లీడర్‌గా ఉంటే ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం, అదే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయితే మరింతగా మంచి చేయోచ్చు, అభివృద్ధి చేసి నక్సల్‌ ప్రభావాన్ని మరింతగా తగ్గించవచ్చు అని భావిస్తాడు. మరి రాజకీయాల్లో రాణించగలిగాడా? అందులో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు? ఎమ్మెల్యేగా గెలిచాడా? అప్పటి సీఎం ఎన్టీ రామారావు దృష్టిలో పడేలా జితేందర్‌ రెడ్డి ఏం చేశాడనేది మిగిలిన కథ…

బయోపిక్ సినిమాల ట్రెండ్‌…

టాలీవుడ్‌, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో ప్రస్తుతం బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ప్రపంచానికి తెలియని చరిత్రలో మరుగున పడిన వ్యక్తుల జీవితాలను వెండితెరపై ఆవిష్కృతం చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తోన్నారు. జితేందర్‌రెడ్డి అలాంటి సినిమానే.

1980 – 90 కథ…

నక్సలిజం ఉద్యమం తెలంగాణలో బలంగా ఉన్న రోజుల్లో 1980 -90 దశకంలో జగిత్యాలకు చెందిన ఆర్ఎస్ఎస్ లీడర్ జితేందర్ రెడ్డి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. జితేందర్‌రెడ్డిని నక్సలైట్లు చంపడానికి ముందు ఏం జరిగిందన్నది? అప్పటి తెలంగాణ సామాజిక జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.

మరో కోణం…

నక్సలిజం ఉద్యమంలోని మరో కోణాన్ని జితేందర్‌రెడ్డి బయోపిక్ ద్వారా ఈ మూవీలో ఆవిష్కరించారు డైరెక్టర్‌. బస్సులను తగలబెట్టడం, బ్రిడ్జ్‌లను రోడ్లను పేల్చేయటం లాంటి పనులతో అభివృద్ధిని అడ్డుకున్నారంటూ చూపించారు. జితేందర్‌రెడ్డిని హీరోగా…కంప్లీట్‌గా పాజిటివ్ కోణంలోనే చూపించాలనే లక్ష్యంతో చేసిన ఈ మూవీ. అందుకు తగ్గట్లే కథ, కథనాలు సాగుతాయి. కొంత సినిమాటిక్ లిబర్జీ తీసుకున్నట్లుగా ఈజీగా తెలిసిపోతుంది.

క్లైమాక్స్‌…

నక్సలైట్లకు ఎదురొడ్డి జితేందర్ రెడ్డి సాగించిన జర్నీతో పాటు అప్పట్లో పీడీఎస్‌యు, ఏబీవీపీ లాంటి స్టూడెంట్స్ యూనియన్స్ ఎలా పనిచేశాయన్నది టచ్ చేశారు. ఎన్టీఆర్‌, వాజ్‌పాయి లాంటి నాయకుల ప్రస్తావన కథలో చర్చించారు. ఆ సీన్స్ బాగున్నాయి. జితేందర్ రెడ్డి నక్సలైట్లు దారుణంగా ఎలా చంపారన్నది క్లైమాక్స్‌లో కళ్లకు కట్టినట్లుగా ప్రజెంట్ చేశారు. పాతకాలం నాటి వార్త పత్రికల క థనాల్ని చూపించడం బాగుంది..