హిట్ అండ్ రన్ కేసులో ఎఫ్ఐఆర్పై అనుమానాలు..
మాదాపూర్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చోరీ కేసుల ఎఫ్ఐఆర్లలోనే ఫిర్యాదుదారు, అనుమానితుల వివరాలు, ఘటనాస్థలం తదితర అంశాలను నమోదు చేసే పోలీసులు.. ఈ కేసులో మాత్రం నిందితుడి పేరుతోనే పరిమితమైన వివరాలు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 16న మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో సంజూష్ ఆస్టన్ మార్టిన్ కారుతో అతివేగంగా వచ్చి భారతి ముఖి అనే 26 ఏళ్ల యువతిని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే.. కారు నడిపిన సంజూష్ పూర్తి వివరాలు ఎఫ్ఐఆర్లో నమోదు చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఫిర్యాదు చేసిన లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్, మృతురాలి వివరాలను మాత్రం పూర్తి చిరునామా, తండ్రి పేరు, వయసు తదితర వివరాలతో నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష సాక్షి ఉన్నా.. మేనేజర్‌తో ఫిర్యాదు ఎందుకు?.
ప్రమాద సమయంలో భారతి ముఖితో కలిసి రోడ్డు దాటుతున్న పూజ అశోక్ అలోనే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నప్పటికీ.. ఆమె నుంచి కాకుండా స్టోర్ మేనేజర్ ద్వారా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దర్యాప్తు ప్రారంభ దశలోనే నిందితుడి వివరాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ప్రమాద పరిస్థితులు వంటి అంశాలను పూర్తిగా నమోదు చేయాల్సి ఉండగా.. ఎఫ్ఐఆర్లో అవి ఏ మేరకు ప్రతిబింబించాయనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిందితుడి తండ్రి లింగమనేని రమేశ్ జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త కావడంతో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఎఫ్ఐఆర్లో పూర్తి వివరాలు నమోదు చేయలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పోలీసుల వివరణ వెలువడాల్సి ఉంది.
సెక్షన్ 105 ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్న.
ఈ కేసులో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) మాత్రమే నమోదు చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన పరిస్థితులు, వాహనం నడిపిన వేగం, డ్రైవింగ్ తీరుపై దర్యాప్తు పూర్తయ్యేలోపు ఏ సెక్షన్లు వర్తిస్తాయనేది నిర్ధారించాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా.. రద్దీ ప్రాంతంలో ప్రమాదకరమైన డ్రైవింగ్ జరిగిందా? డ్రైవర్‌కు తన చర్య వల్ల ప్రాణహాని కలిగే అవకాశం ఉందనే అవగాహన ఉందా? వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి.
బీఎన్ఎస్లోని సెక్షన్ 105, 106 మధ్య నేర స్వభావం, శిక్షలో తేడాలు ఉండటంతో.. ఈ కేసులో సెక్షన్ 105ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ప్రమాదకర డ్రైవింగ్‌కు సంబంధించిన మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 184ను చేర్చకపోవడంపైనా చర్చ జరుగుతోంది.
అయితే ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్లు నమోదు చేయాలన్నది అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆధారాలు, దర్యాప్తు పరిస్థితుల ఆధారంగా పోలీసులు నిర్ణయిస్తారు. కాబట్టి నిందితుడిని కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగా సెక్షన్లు మార్చారన్న ఆరోపణలు నిజమా కాదా అనేది దర్యాప్తు, అధికారిక పోలీసు వివరణ ద్వారా తేలాల్సి ఉంది.