కన్నప్ప’మూవీ రివ్యూ…

విష్ణు మంచు, మోహన్‌ బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రీతి ముకుందన్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం తదితరులు నిర్మాణ సంస్థ: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాత: మోహన్‌ బాబు కథ:పరుచూరి గోపాల కృష్ణ,ఈశ్వర్ రెడ్డి, జి..నాగేశ్వర రెడ్డి
తోట ప్రసాద్
దర్శకత్వం: ముకేశ్‌ కుమార్‌ సింగ్‌
సంగీతం : స్టీఫెన్‌ దేవస్సీ
సినిమాటోగ్రఫీ: షెల్డన్‌ చౌ
ఎడిటర్‌: ఆంథోనీ
విడుదల తేది: జూన్‌ 27, 2025

కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా, నిర్మాతగాను వ్యవహరించాడు. మంచు ఫ్యామిలికి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి. అలాగే ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్‌, ట్రైలర్‌ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగెటివిటీ తగ్గిపోయింది. ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Kannappa Movie Review)..

కథ..!

Kannappa Story || అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్‌). తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడని నమ్ముతుంటాడు. విలు విద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతోపాటు, చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. ఆ గూడేల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది. ఆపద వచ్చిన ప్రతిసారీ అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు తిన్నడు. మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్‌) అతని వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం వెనక కథేమిటి? పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలసింది?ఎవరి చూపు పడనీయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు)ఎవరు?తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే…

వేటగాడు టూ మహాభక్తుడు
గూడెంలో జనాలంతా ఎలాంటి సమస్యలు లేకుండా చల్లగా ఉండాలంటే అమ్మవారికి నరబలి ఇవ్వాల్సిందే అంటూ అంతా నమ్ముతుంటారు. అలా చిన్నప్పుడే తన స్నేహితుడ్ని బలి ఇవ్వడం చూసి తిన్నడు (మంచు విష్ణు) కదిలిపోతాడు. అసలు దేవుడే లేడు.. అది ఒట్టి రాయి మాత్రమే అంటూ అప్పటి నుంచి నాస్తికుడిగా మారతాడు.

పెద్దైన తర్వాత కూడా తిన్నడు మారడు. అయితే ప్రశాంతంగా ఉంటున్న తమ అడవి మీద.. ఉన్న ఐదు గూడాల మీద.. ఆ లోపల ఉన్న వాయులింగం మీద కాలాముఖుడు అనే ఓ దుర్మార్గుడి కన్నుపడుతుంది. ఆ వాయులింగాన్ని దక్కించుకుంటే సర్వశక్తులు వస్తాయనే ఉద్దేశంతో దాని ఆచూకీ కోసం తన తమ్ముడ్ని పంపిస్తాడు కాలాముఖుడు. అయితే కాలా తమ్ముడ్ని తిన్నడు ఒక గొడవలో చంపేస్తాడు. దీంతో తిన్నడిని చంపి ఆ గూడాలు అన్నింటినీ తుడిచిపెట్టేయాలని తన సర్వ సైన్యంతో కాలాముఖుడు పగతో వస్తాడు.

మరి అప్పటివరకూ తమ మధ్య ఉన్న గొడవలతో వేరుగా ఉన్న ఐదు గూడాలు.. కాలాముఖుడ్ని ఎదిరించడానికి ఏకమవుతాయి. తమ నాయకుడిగా తిన్నడ్నే ఎంచుకుంటాయి. కానీ తర్వాత అనుకోని కారణాల వల్ల తిన్నడిని తన తండ్రి నాథనాథుడు గూడెం నుంచి వెలివేస్తాడు. అసలు అలా ఎందుకు చేశాడు..? కాలాముఖుడ్ని తిన్నడు ఓడించాడా? నాస్తికుడైన తిన్నడు మహా శివభక్తుడిగా ఎలా మారాడు అన్నదే మిగిలిన కన్నప్ప కథ.

ఇక తిన్నడు మహా శివభక్తుడిగా మారేందుకు రుద్ర (ప్రభాస్) చేసిన సాయమేంటి. అక్కడి నుంచి శివుడుకి (అక్షయ్ కుమార్) మహా భక్తుడిగా తిన్నడు ఎలా మారాడు. ఇందుకు కారణమైన పరిస్థితులేంటి? అసలు ఈ కథలో కిరాటా (మోహన్ లాల్), మహాదేవ శాస్త్రి (మోహన్ బాబు)ల పాత్రలు ఏంటి అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

కన్నప్ప స్టోరీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. కానీ ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసమే మంచు విష్ణు ఈ భారీ ప్రాజెక్ట్ ను తన భుజాలపై వేసుకున్నాడు. దాన్ని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ను మెచ్చుకోవాల్సిందే. కన్నప్పకు సంబంధించిన స్కెచెస్ తో పాటు పాత సినిమాల్లో లేనట్టుగా ఈ చిత్రంలో శ్రీకాళహస్తికి సంబంధించిన వాయులింగం కోసం గిరిజన తెగలు ఎలా పోరాటం చేసుకున్నాయనే ఎపిసోడ్ ను థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం పెట్టినట్టు తెలుస్తుంది. బీఆర్ చోప్రా తర్వాత మహాభారతం వంటి భారీ సీరియల్ తీసిన అనుభవం కన్నప్పను తెరకెక్కించడానికి బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా కన్నప్ప నాస్తికుడి గా ఎంత మొరటుగా ఉండేవాడనేది చూపించాడు. ఇంటర్వెల్ కు ముందు మోహన్ లాల్ కిరాత పాత్రతో కిరాతార్జునీయం ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. తిన్నడిని ఆస్తికుడిగా మార్చడంలో రుద్ర పాత్రలో ప్రభాస్ రోల్ ఈ సినిమాకు కీలకం అని చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత దాదాపు అరగంట వరకు ఉన్న ప్రభాస్ రోల్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి.

శివుడిగా అక్షయ కుమార్, పార్వతి మాత పాత్రలో కాజల్ అగర్వాల్ పాత్రలు మన తెలుగు సినిమాల మాదిరి కాకుండా హిందీ సీరియల్స్ ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ టేస్టకు తగ్గట్టు వాళ్ల ఆహార్యాన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు ను ఎంచుకోవడం మంచి సెలక్షన్. సినిమాలో ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాల్లో ప్రేక్షకులు భక్తిలో లీనమయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. పాత కన్నప్ప చిత్రాలు చూసిన వాళ్లకు కొంత మేర నచ్చకపోవచ్చు. హీరోయిన్ కు ఇతర లేడీస్ పాత్రలకు బట్టల విషయంలో బాగా పొదుపుగా వాడినట్టు అనిపిస్తుంది. అదేక్కటే కాస్త మైనస్ అని చెప్పాలి. దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ తనదైన శైలిలో మెప్పించాడు. నిర్మాణ విలువలు గ్రాండియర్ గా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల తప్పించి ఓవరాల్ గా బాగుంది. మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా రొటిన్ చిత్రాల ఒరవడిలో కొట్టుకుపోతున్న మనకు ‘కన్పప్ప’ సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే చెప్పాలి. ఇప్పటి తరం తప్పక చూడాల్సిన ఓ భక్తుడి కథ కన్నప్ప..

ప్రభాస్ రాక కోసం చూపులు
నిజానికి ఈ కథలో కావాల్సినంత ఎమోషన్.. పోరాట సన్నివేశాలు పెట్టుకునే స్కోప్ ఉంది. కానీ ఫస్ట్ ఆఫ్ విషయానికొస్తే డైరెక్టర్ ఎక్కువగా పాత్రల పరిచయానికి.. తిన్నడు-నెమలి (ప్రీతి ముకుందన్) మధ్య ప్రేమ సన్నివేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అలానే యాక్షన్ సీన్స్ ఉన్నా కూడా అవి పెద్దగా ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా ఆడియన్స్ చూపులన్నీ.. ప్రభాస్ ఎంట్రీ మీదే ఉన్నాయి. కానీ ఎంతసేపు చూసినా ప్రభాస్ పాత్ర మాత్రం రాలేదేంటి అనే అసహనంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

ఇక 3 గంటల 15 నిమిషాల సినిమాలో దాదాపు 2 గంటల 15 నిమిషాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ ఎంట్రీ వచ్చింది. దీంతో అప్పటివరకూ సీటులో జారి కూర్చున్న అందరికీ.. ఇక ఊపిరి పీల్చుకోండి.. నేను వచ్చేశా అన్నట్లుగా ప్రభాస్ రుద్ర పాత్ర వచ్చింది. అప్పటివరకూ ఉన్న సినిమా గతిని రుద్ర కాస్త పైకి లేపాడు. నిజం చెప్పాలంటే ప్రభాస్ వచ్చేంత వరకూ స్క్రీన్ మీద పెద్దగా హుషారు కనిపించలేదు.

ఇక సినిమాని ప్రభాస్ ఒకసారి లేపితే క్లైమాక్స్ మరోసారి సినిమాకి ఊపు ఇచ్చింది. ముఖ్యంగా తిన్నడిలో భక్తి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి సినిమాలో జీవం వచ్చినట్లు అనిపించింది. క్లైమాక్స్‌లో మహదేవశాస్త్రి (మోహన్ బాబు) వేసిన ప్రశ్నలకి తిన్నడు చెప్పిన సమాధానాలు ఆలోచింపజేస్తాయి. అలానే దైవం-శైవం రెండూ నావే అంటూ విర్రవీగే మహదేవశాస్త్రిని తన భక్తితో నిర్ఘాంతపోయేలా చేస్తాడు తిన్నడు.

విష్ణు నటన
నిజానికి కన్నప్పపై ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రభాస్. కానీ థియేటర్‌కి వచ్చిన జనాల్ని తన నటనతో సర్‌ప్రైజ్ చేశాడు విష్ణు. ఫస్టాఫ్ అంతా కథని బిల్డ్ చేయడానికి సమయం తీసుకున్న డైరెక్టర్ ముకేశ్.. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మోహన్ లాల్ ఎంట్రీతో సినిమాని పైకి లేపారు. అప్పుడు ట్రాక్‌లో పడిన సినిమా క్లైమాక్స్ వరకూ అదే మూడ్‌లో ఆకట్టుకుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో విష్ణు నటన అందరినీ కట్టిపడేసింది. ఇప్పటివరకూ ఇలాంటి పాత్రలో నటించకపోయినా మంచు విష్ణు తన యాక్టింగ్‌తో మెప్పించాడు. శివుడికి తన కళ్లనే నైవేద్యంగా పెట్టే సీన్‌లో విష్ణు నటన చాలా బావుంది. అలానే మహదేవశాస్త్రి పాత్రలో మోహన్ బాబు సరిగ్గా సరిపోయారు. మోహన్ బాబుకి సరైన పాత్ర పడితే స్క్రీన్ మీద ఆయన చేసే మ్యాజిక్ ఏంటో మరోసారి కనిపించింది. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు. క్లైమాక్స్‌లో కన్నప్పని ఎలివేట్ చేసే సీన్‌లో తన నటనతో మెప్పించారు.

ఇక మోహన్ లాల్ చేసిన కిరాటా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయినా కూడా ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. నెమలి పాత్రలో తన అందాలతో ప్రీతి కనులవిందు చేసింది. శరత్ కుమార్.. తిన్నడి తండ్రి పాత్రలో సరిగ్గా సరిపోయారు. ఇక శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతి దేవిగా కాజల్ ఉన్నంతలో న్యాయం చేశారు. సినిమాలో రుద్ర పాత్రకి పెద్దగా పెర్ఫామెన్స్ ఇచ్చే స్కోప్ లేదు కానీ ఆ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపించిన తీరు ఫ్యాన్స్‌కి కిక్కిస్తుంది. అలానే మీకు పెళ్లయిందా అంటూ ప్రభాస్‌ని విష్ణు అడిగే సీన్ థియేటర్లో విజిల్స్ వేయించింది.

ఇక బ్రహ్మానందం, శివబాలాజీ, సప్తగిరి సహా కొన్ని పాత్రలన్నీ ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్లుగానే పరిమితమయ్యాయి. స్టీఫెన్ దేవస్సీ ఇచ్చిన సాంగ్స్‌లో శివా శివా శంకరా సాంగ్ మెప్పించింది. మిగిలిన పాటలు ఫర్లేదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయింది.

సినిమాకి బాగా ప్లస్ అయిన విషయం లొకేషన్స్. దీని గురించి మంచు విష్ణు పదేపదే చెబుతూనే ఉన్నారు. న్యూజిలాండ్‌లోనే ఈ సినిమా తీయడానికి గల కారణం చూసిన తర్వాత ఆడియన్స్‌కి అర్థమవుతుంది అన్నారు. నిజంగానే లొకేషన్స్ అందాలన్నీ చాలా బావున్నాయి. అయితే ఫస్టాఫ్‌లో అక్కర్లేని కొన్ని లవ్ సీన్లు కట్ చేసి ఉంటే సినిమా నిడివి కూడా బాగా తగ్గి ఉండేది.