కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనమే.. కేటీఆర్..

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని మూడు రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేవలం 100 టిఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదన్న కేటీఆర్, కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. అక్కడా కాంగ్రెస్సే, ఇక్కడా కాంగ్రెస్సే అయినా మాట్లాడే దమ్ము, తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేవా? అని రేవంత్ ను నిలదీశారు. ఈ కుట్రపై ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా? అని ప్రశ్నించారు. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను వెంటనే అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహోద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు..