మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదు… కొండ మురళి..!

రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆయన అన్నారు. స్మార్ట్ ఫోన్ చూడటం తనకు రాదని, ఏమైందో తెలియదని చెప్పారు. మంత్రి ఛాంబర్కు ఇప్పటివరకు తాను వెళ్లలేదని చెప్పారు.

తన కుమార్తె, అల్లుడు లండన్లో ఉన్నారని కొండా మురళి తెలిపారు. అక్కడ వారు వ్యాపారం చేస్తున్నారన్నారు. తన బిడ్డకు పదవి ఏమీ లేదని, ఏ పార్టీలోనూ ఆమె లేదని స్పష్టం చేశారు. భద్రతా కారణాల వల్ల వేర్వేరు కార్లలో తాను, సురేఖ వెళ్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారని, ఇస్తారని పేర్కొన్నారు. ఆయన మాట తప్పరని నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రి పొంగులేటి తమ ఇంటికి వచ్చారన్నారు. తననెందుకు టార్గెట్ చేస్తారని కొండా మురళి ప్రశ్నించారు.

సిమెంట్ కంపెనీ యాజమాన్యాలను సుమంత్ బెదిరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఓఎస్డీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు సుమంత్ కోసం పోలీసులు రావడం, మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకోకపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో కొండా మురళి మీడియాతో మాట్లాడారు.

సీనియర్ మంత్రి హెచ్చరించినా లెక్క చేయలేదు : అటవీ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ పేషీలో ఓఎస్డీగా పని చేసిన సుమంత్ వ్యవహారాలను రాష్ట్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. పీసీబీలో ఓఎస్డీగా నియమితులై, డిప్యుటేషన్ మీద అటవీ, దేవాదాయ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పని చేసిన సుమంత్ను తొలగిస్తూ మంగళవారం పీసీబీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.