ముఖ్యమంత్రి భూములను హారతి కర్పూరంలా కాజేస్తున్నరు..తమ్ముడూ.. లెట్స్ కుమ్ముడూ అన్న చందంగా అనుముల బ్రదర్స్ అడ్డగోలుగా దోపిడీ.. కేటీఆర్..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూ బాగోతాలను అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేస్తామనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు గెంటేసిండ్రు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ముఖ్యమంత్రి భూములను హారతి కర్పూరంలా కాజేస్తున్నరు..తమ్ముడూ.. లెట్స్ కుమ్ముడూ అన్న చందంగా అనుముల బ్రదర్స్ అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నరు.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యంలో యథేచ్ఛగా ల్యాండ్ చోరీ జరుగుతున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి సమాంతర రెవెన్యూ వ్యవస్థను నడుపుతూ నిషేధిత జాబితాలో కోటీ పదహారు లక్షల ఎకరాలను చేర్చి కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. గజానికో గజదొంగ మోపై ఇష్టారాజ్యంగా భూ దోపిడీకి తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అనుయాయులు, ఆయన అన్నదమ్ములు కలిసి ప్రజల ఆస్తులను చెరబడుతున్నారని విరుచుకుపడ్డారు. శుక్రవారం నిషేధిత భూములపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముందు తెలంగాణ భవన్లో కేటీఆర్ మాటాడుతూ భూ పంపకాల వాటాలో తేడాలు రావడం వల్లే రేవంత్‌రెడ్డి తన క్యాబినెట్ మంత్రిని బర్తరఫ్ చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలే
బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేవని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఏకంగా కోటీ పదహారు లక్షల ఎకరాలను 22-ఏలో పెట్టి ప్రజల ఆస్తులను చెరబట్టే కుట్రకు తెరలేపారని విమర్శించారు. తన నియోజకవర్గమైన సిరిసిల్ల పరిధిలోని గంభీరావుపేట మండలం సముద్రాలింగాపూర్‌లో 800 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
కొంగర్‌కలాన్ భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను
‘కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంగరకలాన్‌లో కలెక్టరేట్ నిర్మించారు. విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టడంతో అక్కడి భూముల విలువ విపరీతంగా పెరిగింది. దీంతో ఆ భూములపై కాంగ్రెస్ పెద్దల కన్నుపడింది’ అని కేటీఆర్ వివరించారు. ఓ అంతర్జాతీయ కంపెనీకి ఎకరం రూ.15 కోట్లకు ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. గతంలో తాను ఐటీ మంత్రిగా పనిచేశానని, సదరు అంతర్జాతీయ కంపెనీకి లేఖ రాస్తానని స్పష్టంచేశారు.
కేసీఆర్ పాలనలో భూములకు భద్రత
కేసీఆర్ పాలనలో ప్రజల భూములకు భద్రత కల్పించారని కేటీఆర్ గుర్తుచేశారు. ధరణిని తెచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులువు చేశారని, రైతు వేలిముద్ర లేకుండా విక్రయించేందుకు అవకాశం లేకుండా చేశారని తెలిపారు. 2014కు ముందు భూములు కొనేందుకు ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవని చెప్పారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ పాలనలో భూముల విలువ విపరీతంగా పెరిగిందని, రూ. 5 లక్షలుంటే ఎకరా భూమి రూ.50 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. దీంతో పిల్లల పెండ్లిళ్లు, చికిత్స, ఇతరత్రా అత్యవసర ఖర్చుల కోసం ఇబ్బందులు లేకుండా ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయని, భూముల విలువ పడిపోవడంతో ప్రజలు విలవిలలాడుతున్నారని వాపోయారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, రెండేండ్లలో తిరిగి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. 22ఏ జాబితాలో చేర్చిన ప్రతి భూమిని కాపాడుతామని భరోసా ఇచ్చారు. ఈ దుర్మార్గ, పరమ నికృష్ట సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు.
కేటీఆర్‌ను కలిసిన కాసర్ల నాగేందర్‌రెడ్డి..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రోజుల పాలన, హామీల అమలులో వైఫల్యాలు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ, కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటనపై విస్త్రతంగా చర్చించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ కార్యకాలపాల విస్తరణ, పార్టీ కార్యక్రమాలకు ఎన్నారైల మద్దతు కూడగట్టాలని నిర్దేశించారు. ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ బలోపేతంలో కాసర్ల నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు, పార్టీ శ్రేణులు చేస్తున్న కృషిని అభినందించారు. కాగా, రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఆస్ట్రేలియాలోనూ పార్టీ కార్యక్రమాలను విస్రృతంగా నిర్వహించి బీఆర్ఎస్ వాణిని బలంగా వినిపిస్తామని కాసర్ల స్పష్టంచేశారు.
మా గ్రామంలోని 2,900 ఎకరాలు మొత్తం 22A ద్వారా నిషేధిత జాబితాలో పెట్టారు
తెలంగాణ భవన్లో తన ఆవేదన చెప్పుకున్న సిర్పూర్ కాగజ్‌నగర్ మండలం రైతు
నా తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి నాకు వచ్చిన 9 ఎకరాలు ఇప్పుడు నా కొడుకులకు చేద్దామంటే నిషేధిత జాబితాలో పెట్టారు
నాకు క్రాప్ లోన్ కూడా వచ్చింది, ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల నేను సాగు చేస్తున్న పత్తిని కూడా అమ్మలేను
కేసీఆర్‌ను వదులుకుని తప్పు చేశాము, పాలిచ్చే బర్రెను అమ్మి గుర్రాన్ని తెచ్చుకున్నాము
– 22A బాధిత రైతు
ఫ్యూచర్‌సిటీ, మూసీ పేరిట దందా
సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక భూములను హిల్ట్ పాలసీ పేరిట తెగనమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. ఫ్యూచర్ సిటీలో రూ.200 కోట్ల విలువచేసే భూములను తన సోదరుడి కంపెనీ టెస్సెరాక్ట్కు రూ.7 కోట్లకే కట్టబెట్టారని ఆరోపించారు. తన అల్లుడి కోసం లగచర్ల గిరిజన భూములను గుంజుకునేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు ఆర్టీఐని అడ్డంపెట్టుకొని, 40 మంది రిటైర్డ్ రెవెన్యూ అధికారులను నియమించుకొని బ్లాక్ మెయిల్ చేసి భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
రేకుర్తిలో వీధిన పడ్డ 10 వేల కుటుంబాలు
రేకుర్తి గ్రామంలో 6 వేల ఇండ్లు ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్లో 4 డివిజన్లలో ఉన్న ఈ రేకుర్తిలోని 10 వేల కుటుంబాలు నిషేధిత జాబితాలో పెట్టారు. కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోవడంలేదు. 2025 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వేలాది కుటుంబాలు వీధినపడ్డయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నీ సక్రమంగా నడిచినయ్. రైతుబంధు వచ్చింది. ఇప్పుడు రేకుర్తి గ్రామస్తులను చూస్తేనే రిజిస్ట్రేషన్ అధికారులు కిలోమీటరు దూరం తరుముతున్నారు. అన్ని అనుమతులున్నా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారో ప్రభుత్వమే చెప్పాలి.
పాశం మోహన్‌రెడ్డి, రేకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లా
పొంగులేటికి మా బాధలు చెప్పినా పట్టింపేలేదు..
గతంలో 2003లో తహసీల్దార్‌గా 1,000 ఎకరాలు మ్యుటేషన్ చేసిన అధికారే ఇప్పుడు ఆర్డీవోగా వచ్చి.. అవే భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టాడు. టోల్‌ఫ్రీ నంబర్‌కు రేకుర్తి నుంచి 800 మంది ఫోన్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రేకుర్తి నుంచి ఫోన్ చేయొద్దని చెప్పారు స్వయంగా వెళ్లి పొంగులేటిని కలిసి మా బాధలు చెప్పినం. న్యాయం చేస్తా అని ఉత్తరం ఇచ్చిండు. దాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. పొన్నం ప్రభాకర్‌ను, బండి సంజయ్‌ను కలిసినం. కలెక్టర్‌కు అయితే ప్రతి సోమవారం ప్రజావాణికి వెళ్లి అడిగితే మా భయానికి ఆమె అక్కడికి రావడమే మానేశారు. మాకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు.