మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లతో వచ్చే 50 ఏండ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్పై సీబీఐ విచారణ సిగ్గుచేటని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీబీఐని మోదీ జేబు సంస్థగా రాహుల్గాంధీ విమర్శిస్తే, రేవంత్ దానిని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్యస్థితికి నిదర్శనమని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్రావు తన అనుచరులతో బుధవారం ఎర్రవల్లిలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ పదేండ్లలో కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేయలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కండ్ల్లు ఎర్రబడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్ను బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు.
కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నరు
రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆగమాగమైందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నాని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం 21 నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని ప్రతి ఒకరూ అంటున్నారని తెలిపారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీల జాతర, ఆ తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించిందని మండిపడ్డారు. ఆనాటి దుర్భర రోజులను మళ్లీ తీసుకొస్తానని చెప్పి రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజలను నిజాయతీగా మోసం చేశాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు..