అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు, మాస్కులు, ఫైరింజన్‌లో నీళ్లు ఉంటే గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం తప్పది..కేటీఆర్‌..

అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ.. మౌలిక వసతుల కల్పనపై పెడితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సూచించారు…అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు, మాస్కులు, ఫైరింజన్‌లో నీళ్లు ఉంటే గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం తప్పదేని అన్నారు. ఫైర్‌ బ్రిగేడ్‌కు సరైన మాస్కులు లేకపోవడంతో వాళ్లు లోపలికి వెళ్లి బాధితులను కాపాడుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 125 సంవత్సరాల నుంచి చార్మినార్‌ దగ్గర ఉంటున్న అగర్వాల్‌ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్‌ చరిత్రలోనే విషాదకరమని అన్నారు. బాధిత కుటుంబసభ్యులకు రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు…

అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల పరిహారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

చార్మినార్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. సోమవారం క్షతగాత్రులను పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కేటీఆర్ ముందు కన్నీరు పెట్టుకోగా వారిని ఓదార్చారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో బాధితులు సర్వం కోల్పోయారని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ.. ఐదు లక్షలు కాకుండా రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని, అవి వారి ఇంటిని, వ్యాపారాన్ని పున:నిర్మించుకోవడానికి ఉపయోగ పడుతాయని అన్నారు..

గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం విషయంలో బాధిత కుటుంబసభ్యులు ఎవర్నీ నిందించడం లేదని కేటీఆర్‌ అన్నారు. కానీ వారు కొన్ని విషయాలను మాత్రం చెప్పారని తెలిపారు. ఫైర్‌ బ్రిగెడ్లు నీళ్లు, సరైన మాస్కులు లేకుండా లోపలికి వచ్చారని, సరైన మాస్కులే లేకపోవడంతో వారు లోపలికి వెళ్లలేకపోయారని తెలిపారు. అంబులెన్స్‌ల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ఫైరింజన్‌, అంబులెన్స్‌లో కనీస సదుపాయాలు ఉంటే కొన్ని ప్రాణాలు అయితే బతికేవని బాధిత కుటుంబసభ్యులు అంటున్నారు. తమకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని వారు కోరుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఎవరు చనిపోకుండా చూడమని కోరామన్నారు.

తాను రాజకీయం చేయడానికి రాలేదని.. ఎవరినీ విమర్శించడం లేదని కేటీఆర్‌ తెలిపారు.కానీ ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టుకోవాలని సూచించారు. పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశం. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజన్లు, అంబులెన్స్ లు రావడానికి కూడా వీలుకాలేదని అన్నారు. అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలని.. తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కానీ ఇవేవి జరగలేదని.. ఇది మంచిది కాదని చెప్పారు. అంబులెన్స్‌లు వచ్చినయి కాని అందులో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడంతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఎనిమిది మంది చిన్నారులు తమ కళ్లముందే చనిపోయారని చెబుతున్నారని అన్నారు.

ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడాలని సీఎం రేవంత్‌ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటిపై కూడా పెట్టాలని.. అందాల పోటీలపై పెట్టే ఖర్చు ఇలాంటి సందర్భాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలపై పెట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి దగ్గరనే హోం, మున్సిపల్ శాఖలు ఉన్నాయని గుర్తుచేశారు. సంఘటన స్థలం దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తే బాగుండేదని అన్నారు. ఐదు లక్షల నష్టపరిహారం సరిపోదని.. ఇంటికి, వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.. 125 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న అగర్వాల్ కుటుంబం మళ్లీ తమ వ్యాపారం ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం సహకరించాలన్నారు. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరపున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాము. రాజకీయం చేయడానికి రాలేదు. ఇలాంటి కడుపు కోత ఇంకెవరికి రాకూడదని వచ్చాను. ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని కోరారు.