హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రధానమైన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) కాలనీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఫిబ్రవరి 27న నిర్వహించిన బహిరంగ వేలంలో భూముల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ధర్మారెడ్డి కాలనీలోని ఓపెన్ ప్లాట్లు, ఫేజ్-15లోని సంపూర్ణం ఫ్లాట్లకు నిర్వహించిన ఈ వేలంలో కొనుగోలుదారులు పోటీపడి మరీ వేలం పాటలు పాడారు. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.24,49,42,635 ఆదాయం లభించింది..
ధర్మారెడ్డి కాలనీలో గజం రూ.2.65 లక్షలు
ధర్మారెడ్డి కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు జరిగిన వేలంలో గజం ధర గరిష్ఠంగా రూ.2,65,000 పలికింది. LIG-39 ప్లాట్ (205.55 గజాలు) ఈ రికార్డు ధరను సొంతం చేసుకోగా, దీని మొత్తం విలువ సుమారు రూ.5.44 కోట్లుగా నమోదైంది. అదేవిధంగా LIG-105 ప్లాట్ గజానికి రూ.2.41 లక్షలు పలకగా, MIG-24 ప్లాట్ గజానికి రూ.1.39 లక్షల ధర పలికింది. మొత్తం 1,199.98 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ల విక్రయం ద్వారా రూ.15.80 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ వేలంలో ప్లాట్ల సగటు ధర గజానికి రూ.1,31,725గా నమోదైంది.
సంపూర్ణం ఫ్లాట్లకు భారీ డిమాండ్..
మరోవైపు, కేపీహెచ్బీ ఫేజ్-15లోని సంపూర్ణం అపార్ట్మెంట్లలోని 8 ఖాళీ ఫ్లాట్లకు కూడా భారీ పోటీ ఎదురైంది. 1,400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్లకు హౌసింగ్ బోర్డు రూ.90 లక్షల కనీస ధర (Upset Price) నిర్ణయించగా, వేలంలో అత్యధికంగా రూ.1,10,50,000 ధర పలికింది. ముఖ్యంగా B1/807, B1/1005 నంబర్లు గల ఫ్లాట్లు ఈ గరిష్ఠ ధరను నమోదు చేశాయి. అత్యంత తక్కువగా ఒక ఫ్లాట్ రూ.96 లక్షలకు అమ్ముడైంది. ఎనిమిది ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ.8.44 కోట్ల ఆదాయం సమకూరింది.
ఫేజ్-1 మరియు 2 లోని ధర్మారెడ్డి కాలనీ లోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం అపార్ట్ మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం నాడు బహిరంగ వేలం నిర్వహించారు. మొత్తం 40 మంది కొనుగోలు దారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్ ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్దారించగా…. చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడు పోయింది.
మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారు.
అదే విధంగా సంపూర్ణం అపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు (Flats) రూ .90 లక్షలను అప్ సెట్ ధరగా నిర్దారించగా….. వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు.