కొత్త సీఎంకు మా మద్దతు ఉంటుంది: కేజీవాల్
ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కొత్త సీఎంకు ప్రతి పనిలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు..
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖాగుప్తా
బీజేఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం
రేపు మ.12:35కి ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం
రేపు సీఎంతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణం
డిప్యూటీ సీఎంగా పర్వేశ్‌వర్మకు అవకాశం
రేఖాగుప్తా నివాసం దగ్గర సంబరాలు..
ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు: KTR
TG: బీఆర్ఎస్ రజతోత్సవాలను ఒక సంవత్సరం పాటు పండుగలా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇందు కోసం ఉద్యమ సహచరులతో, పార్టీ ముఖ్యులతో పలు కమిటీలను వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో అన్ని వర్గాల వారిని ఇందులో భాగం చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు..
విజయవాడ: వల్లభనేని వంశీ పిటిషన్‌పై నేడు విచారణ
జైలులో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్
సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి..
ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖతీసుకోవాలని ఆదేశం
వంశీ పిటిషన్‌పై విచారించనున్న ఎస్సీ, ఎస్టీ కోర్టు..
రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని….
తక్షణమే జోక్యం చేసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి తెలంగాణ రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆనకట్టల భద్రత కమిటీ చైర్మన్ హోదాలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) ఎన్.అనిల్‌కుమార్ బుధవారం ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. 1981లో నిర్మించిన శ్రీశైలం జలాశయానికి 2009లో వచ్చిన భీకర వరదలతో స్పిల్ వే దిగువన నీళ్లుపడే ప్రాంతంలో భారీ గుంత (ప్లంజ్ పూల్) ఏర్పడిందని గుర్తు చేశారు.
ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడంతో.. క్రమంగా ప్లంజ్ పూల్ విస్తరిస్తూ, జలాశయానికి ముప్పుగా పరిణమించిందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయాన్ని 14 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా డిజైన్ చేయగా.. 2009లో ఏకంగా 25లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని వివరించారు. భారీగా నీటి విడుదలతో.. స్పిల్ వేకు దిగువన భూమి కోతకు గురై భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. ఈ గుంతను పూడ్చకపోతే 143.23 మీటర్ల ఎత్తున్న జలాశయం పునాదులను బలహీనపరిచి, డ్యామ్‌కు ప్రమాదకరంగా మారుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ వంటి సంస్థలు అధ్యయనంలో తేల్చాయని వివరించారు.
జలాశయానికి ప్రమాదం జరిగితే భారీ నష్టం
శ్రీశైలం జలాశయానికి ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాలను భారీ వరద ముంచేస్తుందని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర విపత్తును సృష్టిస్తుందని లేఖలో అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీటి సరఫరా, జల విద్యుదుత్పత్తి నిలిచిపోతాయని పేర్కొన్నారు. జలాశయం పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తక్షణమే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్డీఎస్ఏను కోరారు.
వచ్చే వానాకాలంలో గుంత మరింత విస్తరించకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయం రక్షణకు చర్యలు తీసుకోకపోతే దిగువన ఉన్న నాగార్జునసాగర్, ప్రకాశం బరాజ్‌లు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొంటాయన్నారు. అదే జరిగితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తాగు, సాగునీటితోపాటు చెన్నైకి తాగునీటి సరఫరా సైతం నిలిచిపోతుందని వివరించారు..
తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ ఘెర పరాజయం..
ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది..బుధవారం 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. విలియం ఓ’రూర్కే, మిచెల్ సాంట్నర్ తలా 3 వికెట్లు పడగొట్టారు. మ్యాట్ హెన్రీ 2 వికెట్లు పడగొట్టాడు.
కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ 5 వికెట్లకు 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరపున విల్ యంగ్ 107, టామ్ లాథమ్ 126, గ్లెన్ ఫిలిప్స్ 54 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు పడగొట్టాడు. అబ్రార్ అహ్మద్, హరిస్ రవూఫ్ లకు కూడా తలా ఒక వికెట్ దక్కింది.
పాకిస్తాన్ తరఫున ఖుష్దిల్ షా (69 పరుగులు), బాబర్ ఆజం (64 పరుగులు) అర్ధ సెంచరీలు సాధించారు.సల్మాన్ అలీ అఘా 42 పరుగులు, ఫఖర్ జమాన్ 24 పరుగులు చేశారు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ’రూర్కే..
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు..బండి సంజయ్.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు..కరీంనగర్లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, పది సీట్లలో ఉప ఎన్నికలు వస్తే ఏడిట్లో బీజేపీ గెలవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి సమావేశాలు రహస్యంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి నూకలు చెల్లబోతున్నాయని, ఎప్పుడు ఊడుతుంతో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కులగణన పేరుతో 60 లక్షల మంది బీసీలను తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందూ జాతిలో ముస్లింలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు.
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన చోట ఎంఐఎం గెలిచిందని, పది శాతం ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగ, ఉపాధ్యాయులు జీతాల కోసం అడుక్కునే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును కూడా ప్రభుత్వం ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సీ సహా ఏ సమస్యనూ పరిష్కరించలేదని విమర్శించారు. రాష్ట్ర క్యాబినెట్లో నలుగురు మంత్రులకు సంబంధించిన బిల్లులు మాత్రమే క్లియర్ అవుతున్నాయని సంజయ్ ఆరోపించారు..
బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ సంబరాలా?.. కేరళ సీఎం విజయన్ ఆగ్రహం
తిరువనంతపురం: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని విజయోత్సవం జరుపుకునే స్థాయికి కాంగ్రెస్ , రాహుల్ గాంధీ దిగజారిపోయారని కేరళ సీఎం విజయన్ విమర్శించారు..బుధవారం జరిగిన ఎప్ఎఫ్ఐ 35వ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలుపునకు ఏమాత్రం అవకాశం లేని కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి రావడానికి మాత్రం సహాయం చేసిందని అన్నారు.
ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో పోటీచేసిన కాంగ్రెస్ 65 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, అయినప్పటికీ ఆప్ అధికారం కోల్పోగానే ఆ పార్టీ ఢిల్లీలో విజయోత్సవాలు జరుపుకుందని విమర్శించారు..
దిగొచ్చిన పాక్.. పాకిస్తాన్ గడ్డపై భారత జెండా
చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా స్టేడియంలో భారత జెండా ఎగరేయకపోవడంపై విమర్శలు రావడంతో పాకిస్థాన్ దిగొచ్చింది. తాజాగా కరాచీ స్టేడియంలో భారత పతాకాన్ని ప్రదర్శించింది..టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాక్.. రెండ్రోజుల క్రితం స్టేడియంలో భారత జెండా మినహా అన్ని దేశాల జట్ల జెండాలను ఏర్పాటుచేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవడంతో.. రోహిత్ సేన తమ దేశంలో మ్యాచ్‌లు ఆడడం లేదు కాబట్టే ఆ దేశ జాతీయ పతకాన్ని ప్రదర్శించలేదని పాక్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే..
కామారెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల్లారా జాగ్రత్త కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించడానికి బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటయ్యాయి…ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ – బిఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికలో వలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బిఆర్ఎస్ పరోక్ష మద్దతు ఇస్తున్నది అని అన్నారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేవుడు పేరు చెప్పి ఓట్లు దండుకోవడం బీజేపీ పార్టీకి పరిపాటిగా మారింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని బీజేపీ, బిఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ – బిఆర్ఎస్ కుట్రను తిప్పికొట్టి కాంగ్రెస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి అని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బిఆర్ఎస్ పదేళ్లలో 50 వేల ఉద్యోగాలు ఇస్తే..కాంగ్రెస్ ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.
ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నాం. ట్యూషన్ల నుంచి మొదలైన పార్టీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి ప్రయాణం విద్యాసంస్థలు నెలకొల్పి వేలమందిని విద్యావంతులను తయారు చేసిన వ్యక్తి. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గ్రాడ్యుయేట్ పరిధిలోని నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి.. బడ్జెట్ లో రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండు సున్నా. బడ్జెట్ లో రూపాయి తీసుకోరాని బీజేపీ ఎంపీలను నిలదీయండి అని ఆయన అన్నారు.
నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వంతో చర్చించి పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తారు. విద్యావేత్త గా నరేందర్ రెడ్డికి నాలుగు ఉమ్మడి( ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్) జిల్లాలపై అవగాహన ఉంది.. బీజేపీ అభ్యర్థికి ఇక్కడి పట్టభద్రుల సమస్యలపై అవగాహన లేదు అని ఆయన అన్నారు…
తెలంగాణలో పేదలకు శుభవార్త, ప్లాట్లకు మార్చి 31వరకు ఎల్ఆర్ఎస్.
తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఎల్ఆర్ఎస్ (లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.(LRS for plots) ఈ పథకం అమలు ప్రగతిపై బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సమావేశం జరిగింది..ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుదిళ్ల శ్రీధర్ బాబులు పాల్గొన్నారు.
– ఎల్ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.(Good news for the poor)
– ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీని మార్చి 31వతేదీ వరకు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లే అవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు పలు వెసులుబాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.
భూముల రెగ్యులరైజేషన్ కు అవకాశం
ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్ కు అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31వతేదీ వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఉన్న వారికి కూడా 31 లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. పేద ప్రజలు, గత నాలుగు సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం గురించి ఎదురు చూస్తున్నారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు.
ఎల్ఆర్ఎస్ ఇక సులభతరం
ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా పలు వెసలుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని, వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.