LPG గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్న హాస్టళ్లు, పీజీలు పొగమయంగా మారిన హైదరాబాద్ ఐటీ కారిడార్.

LPG గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్న హాస్టళ్లు, పీజీలు

పొగమయంగా మారిన హైదరాబాద్ ఐటీ కారిడార్..

ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణతో అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడింది. ముడి చమురులో భాగమైన పెట్రోల్‌, డీజిల్‌తోపాటు ఎల్పీజీ గ్యాస్‌ కొరత ఏర్పడింది. ఘర్షణలో భాగంగా రీఫైనరీలపై దాడులు చేస్తుండడంతో వాటి ఎగుమతిపై ఆధారపడిన దేశాలతోపాటు దిగుమతి చేసుకోవాల్సిన దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నది భారతదేశం. గ్యాస్‌ కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో దేశంలో మళ్లీ కరోనా లాంటి రోజులు వచ్చేశాయి. ప్రైవేటు సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలు కల్పిస్తుండగా.. ఇక సాధారణ ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లుతున్నారు..కమర్షియల్ సిలిండర్స్ పంపిణీ వ్యవస్థలో తగ్గుముఖం రావడంతో హైదరాబాద్‌లోని పలు హాస్టల్స్‌ కట్టెల పొయ్యిపై వంటకాలు చేస్తున్నాయి. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా కట్టెల పొయ్యి వినియోగం పెరిగింది. సాధారణంగా పాతబస్తీలోని పిస్తా హౌస్‌ మొదటి నుంచి కట్టెల పొయ్యి వినియోగిస్తోంది. ఇప్పుడు అన్నింటికీ కూడా ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ కాకుండా కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని హాస్టల్స్‌లలో కట్టెల పొయ్యి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేపీహెచ్‌బీ కాలనీలోని శ్రేయసి లగ్జరీ పీజీ హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని వండారు. సరిపడా గ్యాస్ లేకపోవడం హాస్టల్లో ఉండే వారికి ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతోనే హాస్టల్‌ బయట గేటు ముందు కట్టెల పొయ్యిపై వంటకం చేశారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చర్యలు చేపట్టాలని లేదంటే హాస్టల్ లో ఉండేవారు రోడ్డుపై పడాల్సి వస్తుందన్నారు….అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడడంతో కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.60 పెంచడం.. మరోవైపు గ్యాస్ కావాలంటే ఓటీపీ విధానాన్ని అమలు చేసిన కేంద్రం, హోటల్ రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్లు సరఫరా నిలిపివేశారు. దీంతో గృహ వినియోగదారులు తమకు గ్యాస్ సిలిండర్లు దొరకవేమో అని భయంతో గ్యాస్ సిలిండర్ కోసం ఎగబడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసి నాలుగు ఐదు రోజులైనా సిలిండర్లు ఇవ్వడం లేదు. కొన్ని హోటళ్లకు (డొమెస్టిక్ సిలిండర్) ఇంటి వినియోగించే సిలిండర్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్యాస్ సరఫరా చేయాలని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు..

పొగమయంగా మారిన హైదరాబాద్ ఐటీ కారిడార్..

కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న హాస్టల్‌లో గ్యాస్ కొరత తీవ్ర సమస్యగా మారింది. హాస్టల్‌లో వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బంది, నివాసితులు రోడ్డుపై తాత్కాలికంగా కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హాస్టల్‌లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు భోజనానికి ఇబ్బందులు పడుతుండటంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయంగా బయట వంటలు ప్రారంభించారు. రోడ్డుపై వంటలు చేయడం వల్ల స్థానికంగా కొంత అసౌకర్యం కూడా ఏర్పడింది. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించాలని హాస్టల్‌లో నివసించే వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు గ్యాస్ సమస్యతో హాస్టళ్లలో మెనూ పూర్తిగా మార్చేశారు నిర్వాహకులు. కేవలం రెండు పూటల మాత్రమే భోజనం అందించగలమని ప్రకటించారు. ఉదయం టిఫిన్స్, బ్రేక్ ఫాస్ట్ లు ఇవ్వడం వీలుకాదని చెప్పినట్లు పలు హాస్టల్లో ఉంటున్న బోర్డర్స్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఉందని.. అదే జరిగితే కాలేజీలకు, ఉద్యోగాలకు ఎలా వెళ్లాలని ఆవేదని వ్యక్తం చేస్తున్నారు.