ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. 19 ఏళ్ల తమ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ ను నమోదు చేసింది. సోమవారం సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది..అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. మిడలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (21 బంతుల్లో 63, 1 ఫోర్, 8 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో కార్బిన్ బోష్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ ను 18.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్బ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 84, 6 ఫోర్లు, 7 సిక్సర్లు)తో సిక్సర్ల సునామీ సృష్టించాడు. బౌలర్లలో సిద్ధార్థ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో హ్యాటిక్ ఓటముల తరవాత ముంబై విజయం సాధించినట్లు అయింది. మరోవైపు లక్నోకు ఇది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. ఇక మంగళవారం జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది…
అద్భుత బ్యాటింగ్.. రో.. హిట్…!
భారీ టార్గెట్ తో బరిలోకి ముంబైకి ఓపెనర్లు రోహిత్, ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా వింటేజ్ రోహిత్ ను గుర్తు చేస్తూ రోహిత్ సిక్సర్లను బాదాడు. మరోవైపు రికెల్టన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వేగంగా పరుగులు సాధిస్తూ, స్కోరు బోర్డును పరుగులెత్తించారు. దీంతో పవర్ ప్లేలో 71 పరుగులను సాధించింది. ఎంతమంది బౌలర్లను మార్చిన ఓపెనర్ల జంటను విడదీయడంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ విఫలమయ్యాడు. ఈక్రమంలో ముందుగా రికెల్టన్ 22 బంతుల్లో ఫిఫ్టీ, ఆ తర్వాత రోహిత్ 27 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 65 బంతుల్లోనే 143 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నమోదయ్యాక రికెల్టన్ ఔట్ అయ్యాడు..
చేయి జారిన సెంచరీ. ..
ఇక వన్ డౌన్ లో వచ్చిన తెలుగు స్టార్ తిలక్ వర్మ (11) ఎక్కువగా స్ట్రైక్ ను రోహిత్ కు ఇచ్చాడు. అయితే సెంచరీ వైపు దూసుకెళుతున్న రోహిత్ ను సిద్ధార్థ్ బోల్తా కొట్టించాడు. దీంతో స్టేడియం మొత్తం నిశ్చబ్ధంగా మారిపోయింది. ఆ తర్వాత కాసేపటికే తిలక్ వర్మ భారీ స్కోరుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (12), నమన్ ధీర్ (23 నాటౌట్) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ వేగంగా ఆడటంతో టార్గెట్ కరిగిపోయింది. ఆ తర్వాత కాసేపటికి సూర్య వెనుదిరిగినా, విల్ జాక్స్ (10 నాటౌట్) తో కలిసి నమన్, MI జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రికెల్టన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది..
పూరన్ ధనాధన్
నికోలస్ పూరన్ పూనకం వచ్చినట్టు చెలరేగడంతో పవర్‌ప్లేలోనే 90 పరుగులు చేసిన లక్నో భారీ స్కోరు అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఆరంభం నుంచే దూకుడు మంత్రం జపించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ తొలి ఓవర్లో 6,4తో దీపక్ చహర్‌కు స్వాగతం పలికాడు. మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన జోష్ ఇంగ్లిష్ (13)ను ఘజన్ఫర్ వెనక్కుపంపినా.. బుమ్రా బౌలింగ్‌లో 6, 4, 4తో మార్ష్ నాలుగు ఓవర్లకే స్కోరు 50 దాటించాడు. ఇక స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో మూడు భారీ సిక్సర్లతో పూరన్ తనలోని హిట్టర్‌ను నిద్రలేపాడు. ఆపై ఘజన్ఫర్ వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ రాబట్టాడు. ఫీల్డింగ్ మారిన తర్వాతా పూరన్ పవర్ తగ్గలేదు. బాష్ బౌలింగ్‌లో సిక్స్, చహల్ ఓవర్లో రెండు సిక్సర్లతో 16 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. మరో ఎండ్‌లో మార్ష్ సైతం దూకుడు చూపెట్టడంతో 8 ఓవర్లకే లక్నో 123/1తో నిలిచింది.
అయితే, తర్వాతి ఓవర్లో ఈ ఇద్దరినీ ఔట్ చేసిన కార్బిన్ బాష్ ప్రత్యర్థి జోరుకు స్పీడు వేశాడు. ఇక్కడి నుంచి ఆతిథ్య బౌలర్లు పుంజుకున్నారు. కీపర్ రికెల్టన్ పట్టిన అద్భుత క్యాచ్‌తో కెప్టెన్ రిషబ్ పంత్ (15)ను జాక్స్ వెనక్కుపంపగా.. అక్షత్ రఘువంశీ (11)ని రఘు శర్మ ఔట్ చేశాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. మార్క్రమ్ (31 నాటౌట్)తో కలిసి అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన హిమ్మత్ సింగ్.. ఘజన్ఫర్ బౌలింగ్‌లో 6,4తో ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. కానీ, చివరి మూడు ఓవర్లలో వరుసగా 9, 7, 6 పరుగులు మాత్రమే ఇచ్చిన ముంబై బౌలర్లు టార్గెట్ మరీ ఎక్కువ కాకుండా చూసుకున్నారు…