జాతుల మధ్య ఘర్షణలతో రావణకాష్టంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఘర్షణలు ప్రారంభమై రెండున్నరేళ్లు పూర్తైనా మోదీ అక్కడ పర్యటించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చిన వేళ ఆయన అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ పర్యటనపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మణిపుర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయెల్ రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రధాని చురాచంద్పూర్లో ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుసుకుంటారని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 7వేల 3 వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. అనంతరం పీస్గ్రౌండ్లో మణిపుర్ను ఉద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు. తర్వాత రాజధాని ఇంఫాల్ వెళ్లి అక్కడ 12 వందల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మైతేయ్-కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో చురాచంద్పుర్ తీవ్రంగా నష్టపోయింది. 260 మందికి పైగా ఇక్కడ బలయ్యారు. వేలమంది నిరాశ్రయులయ్యారు. సెప్టెంబర్ 13-15 మధ్య మోదీ మిజోరాం, మణిపుర్, అసోం, పశ్చిమ బంగాల్, బిహార్లలో పర్యటిస్తారు…
మోదీ పర్యటన రాష్ట్ర ప్రజల అదృష్టం
మణిపుర్కు చెందిన రాజ్యసభ ఎంపీ లీషెంబా సనాజావోబా మోదీ మణిపుర్లో పర్యటించడం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. ఇలాంటి సమయంలో ఏ ప్రధాని కూడా రాష్ట్రాన్ని సందర్శించి ప్రజల మాట వినలేదన్నారు. మరోపక్క మోదీ పర్యటనను కుకీ- జో తెగలు స్వాగతించాయి. ఇదొక అరుదైన ఘట్టంగా అభివర్ణించాయి…