ప్లాట్ ఓనర్లపై రియల్టర్ అనుచరుల దాడి
మేడ్చల్ జిల్లా కొర్రెములలోని ఏకశిలా లేఅవుట్లో ఉద్రిక్తత..
పోలీసుల ముందే బాధితులపై విచక్షణారహితంగా దాడిచేసిన రియల్టర్ అనుచరులు..
ఏకశిలా లేఅవుట్లో సర్వే చేయించడానికి వచ్చిన రియల్టర్ వెంకటేష్.. సర్వేను అడ్డుకున్న ప్లాట్ యజమానులు..
రియల్టర్ వెంకటేష్ యాదవ్ ఆగడాలపై బాధితుల ఆగ్రహం..
సర్వే పేరుతో ప్లాట్ల ఆక్రమణకు యత్నం చేస్తున్నారని ఆరోపణలు..
నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్లాట్ యజమానుల డిమాండ్..
హైడ్రా క్లీన్ చిట్ ఇచ్చినా ఆగని ఆక్రమణలు..
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 739 నుండి 749లోని ఏకశిల వెంచర్ లో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్నాళ్లుగా ఏకశిలా ప్లాట్ ఓనర్ యజమానులు, ఏకశిల భూములను కొన్న వెంకటేష్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. సంవత్సరం క్రితం ప్లాటు యజమానుల తరపున మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇద్దరి యువకులను కొట్టిన కేసులో కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఏకశిలా వెంచర్ చుట్టూ వెంకటేష్ అనుయాయుల పహారా ఉండటంతో అక్కడికి ప్లాటు యాజమానులు వెళ్లడానికి వీలుపడేది కాదు. ప్లాటు యజమానులను భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యానికి పాల్పడుతుండటంతో వెంకటేష్ అనుయాయులపై పోచారం పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి. కొంతకాలం పోచారం పోలీస్ స్టేషన్ పోలీసులు ఏకశిలా వెంచర్ పరిసర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికటింగ్ కూడా నిర్వహించారు. తాజాగా శుక్రవారం ఏకశిలా వెంచర్లో ఏడీ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్న ప్లాటు యజమానులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసాయి.
ఇది వ్యవసాయ భూమి కాదు….
ఏకశిల వెంచర్ లో భూమి అగ్రికల్చర్ ల్యాండ్ కాదని, ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు బాధితులు గుర్తు చేశారు. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంతమంది అధికారుల అండదండలతో ఈ విలువైన భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఏడి సర్వే చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 20 మందికి పైగా ప్లాటు ఓనర్లకు ఎల్ఆర్ఎస్ అప్రూవల్ రాగా వాటిని అడ్డదారిలో అధికారులకు మామూళ్లు అప్పజెప్పి రియల్టర్ వెంకటేష్ అప్రూవల్ అయినా ఎల్ఆర్ఎస్లను రద్దు చేయించాడని వాపోయారు. తమ ప్లాట్ల రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, అక్రమ కబ్జాలను సాగనివ్వమని హెచ్చరించారు.