మైక్రోసాఫ్ట్‌లో 9వేల మంది ఉద్యోగుల తొలగింపు..!
లాభాల్లో ఉన్నా సిబ్బందిపై వేటు
ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు....
ఇదే 2025లో రెండోసారి మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతల గురించి ప్రకటన ఇచ్చారు, దీనిబట్టి టెక్ రంగంలో మార్పుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మే నెలలో తొలిసారి ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసిన సంస్థ, ఇప్పుడు జులైలో మరోసారి అదే దారిలో నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి రంగాల్లో వేగంగా ముందుకెళ్తున్న మైక్రోసాఫ్ట్, మానవ వనరులను తగ్గిస్తూ తన నిర్మాణాన్ని నూతనంగా మలుచుకుంటోంది. ఈ నిర్ణయం సంస్థ అభివృద్ధి దిశలో ఒక వ్యూహాత్మక అడుగు కాగా, వేలాది మంది ఉద్యోగులకు ఇది ఊహించని సమస్యగా మారింది. రెండోసారి వచ్చిన ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలు, ప్రభావిత విభాగాలు, ఈ సంస్థ భవిష్యత్ దిశపై అడుగులు గురించి తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో 9,000 మందిని తొలగించింది. ఈ మేరకు బుధవారం నాడు ప్రకటన విడుదల చేసింది. 2026వ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ నిర్ణయం తీసుకుంది. గత త్రైమాసికంలో 26 బిలియన్ల లాభం సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తొలగించింది. కంపెనీ నిర్వహణ స్థాయిని తగ్గించి, కార్యకలాపాలను సులభతరం చేయాలనే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కోంది. మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 228,000 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 3.9% ఉద్యోగులను బుధవారం తొలగించింది. ఈ ఏడాదిలో మొత్తం 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని, జూన్‌లో అమెరికా ప్రైవేట్ సెక్టార్లో 33,000 ఉద్యోగాలు తగ్గాయని ఏడీపి ( ఆటోమేటిక్ డేటా ప్రోసెసింగ్ ) సంస్థ నివేదించింది.
లాభాలు ఉన్నా ఎందుకు తొలగింపు ?
మైక్రోసాఫ్ట్ లాభాల్లోనే పనిచేస్తుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ 70 బిలియన్ డాలర్ల ఆదాయంలో 26 బిలియన్ డాలర్ల నికర లాభం సాధించింది. ఈ లెక్కలు వాల్‌స్ట్రీట్ అంచనాలను మించిపోయాయి. అయినప్పటికీ కంపెనీ తన ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తోంది. తన కార్యకలాపాలను సులభతరం చేయడానికి, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి ఇమెయిల్ ద్వారా తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయం సాధించడానికి, బృందాలను సిద్ధం చేయడానికి ఈ మార్పులు అవసరమని, ఏఐ , క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 80 బిలియన్ల పెట్టుబడులు పెడుతూ, కంపెనీ దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి సారిస్తోందని తెలిపింది. ఈ ప్రకటనతో స్టాక్మార్కెట్లో మైక్రోసాఫ్ట్ షేర్లు బుధవారం ఉదయం 0.6% తగ్గిపోయాయి. మరోవైపు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు ఆటోడెస్క్, చెగ్జి, క్రౌడ్స్ట్రైక్జి వంటి కంపెనీలు ఉద్యోగుల తొలగింపుకు సిద్దమవుతున్నాయని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.