విదేశీ విహారయాత్రలు,, బంగారం కొనుగోలు వద్దు.!.. ప్రధాని పిలుపు..!

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ అనుకున్నదానికంటే వేగంగా దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్‌–మే–జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌ నుంచి వీడియో సందేశం ద్వారా మాట్లాడిన మోదీ.. ఈ వృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. అదే సమయంలో ప్రజలకు పొదుపు మంత్రాన్ని సూచించారు. విదేశీ విహారాలు, విదేశాల్లో వివాహ వేడుకలకు దూరంగా ఉండాలని.. భారత్‌లోనే వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అవసరం లేకుండా బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు.
ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతున్నా భారత్‌ మాత్రం వేగంగా ముందుకు సాగుతోందని మోదీ అన్నారు. దేశ వృద్ధిని కొనసాగించేందుకు ఆత్మనిర్భరత, స్వదేశీ, స్వావలంబన అవసరమని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అగ్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఇవే పునాదులని స్పష్టం చేశారు.
అయితే మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ప్రధాని మాటలు కేవలం ‘లైట్స్‌, కెమెరా.. పీఆర్‌ కథ’ అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తోందని ఆరోపించారు.