పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను సంప్రదించారు. భారత యుద్ధ సన్నాహాలపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. అంతకు ముందే పాక్ సమాచార మంత్రి అతుల్లా తరార్ భారత్ మరో రెండు రోజుల్లో యుద్ధానికి వస్తుందన్న విశ్వసనీయ సమాచారం తమ దగ్గర ఉందనే విషయాన్ని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు బీరాలు పోయిన పాకిస్తాన్ ఇప్పుడు భయంతో పరుగులు తీస్తోంది.
యూఎన్ సెక్రటరీతో ఫోన్ సంభాషణ..
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెర్రస్ తో పాక్ ప్రధాని షెహబాజ్ ఫోన్ లో మాట్లాడారు. భారత్ యుద్ధసన్నాహాలు, ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను ఆయనకు వివరించారని తెలుస్తోంది. దీని తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఫోన్ సంభాషణ గురించి చెబుతూ..తాము ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించామని తెలిపారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని చెప్పారు. మళ్ళీ ఆయనే తమ దేశానికి అన్యాయం జరిగితే, దాడి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. అయితే షెహబాజ్ అభ్యర్థనకు యూఎన్ ఎలా స్పందించిందో మాత్రం ఇంకా తెలియలేదు.
పహల్గామ్ దాడి తర్వాత పెద్దగా నోరు విప్పని ఫెహబాజ్ ఇప్పుడు యుద్ధం అనేసరికల్లా ఉగ్రవాదం, శాంతి అంటూ కబుర్లు చెబుతున్నారు. పైగా పహల్గామ్ దాడిపై పారదర్శకమైన దర్యాప్తుకు పిలుపునిచ్చామని భారత ప్రభుత్వం ఒప్పుకోలేదని అన్నారు.