నేపాల్ చైనా సరిహద్దుల్లో సంభవించిన పెను వరదల కారణంగా చైనా భూభాగంలో చిక్కుకుపోయిన 400 మందికి పైగా భారతీయులు పూర్తి సురక్షితంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం ప్రకటించారు…బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక చైనా అధికారులు, టూర్ లీడర్లు, ట్రావెల్ ఏజెంట్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. బాధితుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ విపత్తులో చిక్కుకున్న వారిలో 96 మంది ఇప్పటికే నేపాల్ చేరుకోగా, తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులు ఖాట్మండు నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో సురక్షితంగా చేరుకున్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. త్రిశూల్ వన్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న మరో 63 మంది భారతీయులను రెస్క్యూ బృందాలు కాపాడాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయని, సమాచారం అందుతున్న కొద్దీ సంఖ్యల్లో మార్పులు రావచ్చని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది…..చైనా వైపు ఉన్న 400 మందికి పైగా భారతీయులు సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించిన కేంద్ర ప్రభుత్వం, వారిని స్వదేశానికి తరలించేందుకు చైనా ప్రభుత్వంతో కలిసి ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక అధికారుల సమన్వయంతో అందరినీ క్షేమంగా తీసుకువస్తామని స్పష్టం చేసింది. అనేక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణ కావడంతో అధికారులు మరింత వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.
నేపాల్‌కు భారత్ భారీ సాయం
తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఆగస్టు 26, 27 తేదీల్లో దాదాపు 47.5 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత వాయుసేన, శుక్రవారం సాయంత్రం మూడో ప్రత్యేక విమానం ద్వారా మరో 13 టన్నుల సామగ్రిని పంపించింది. ఇందులో జనరేటర్లు, మందులు, వాటర్ ప్యూరిఫికేషన్ మాత్రలు, ఆహార పదార్థాలు, టెంట్లు ఉన్నాయి. దీంతో నేపాల్‌కు భారత్ పంపిన మొత్తం సాయం 60 టన్నులకు చేరింది..
500 మందికి పైగా మృతులు..
నేపాల్-టిబెట్ సరిహద్దులోని లెండే నది వద్ద కొండచరియలు విరిగిపడి ఆకస్మికంగా వచ్చిన వరదల వల్ల తీవ్ర విధ్వంసం జరిగింది. భోటేకోషి, త్రిశూలి నదులు ఉప్పొంగడంతో ఇప్పటివరకు నేపాల్‌లో 538 మంది, చైనాలో ఐదుగురు మరణించారు. రసువా, దాదింగ్ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో వందలాది మంది గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.