Neti panchangam… నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 15 – 02 – 2026,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
బహుళ పక్షం,

తిథి : *త్రయోదశి* సా4.38 వరకు,
నక్షత్రం : *ఉత్తరాషాఢ* రా7.42 వరకు,
యోగం : *వ్యతీపాత* తె3.01 వరకు,
కరణం : *వణిజ* సా4.38 వరకు,
తదుపరి *భద్ర* తె5.02 వరకు,

వర్జ్యం : *రా11.54 – 1.36*
దుర్ముహూర్తము : *సా4.24 – 5.10*
అమృతకాలం : *మ12.50 – 2.33*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండం : *మ12.00 – 1.30*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం : 6.32,
సూర్యాస్తమయం : 5.57,

*_నేటి విశేషం_*
*మహాశివరాత్రి*
*మహాశివరాత్రి మాహాత్మ్యం*

*వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం*
*వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిమ్ ।*
*వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుందప్రియమ్*
*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్॥*

అష్టాదశమహాపురాణాలలో అగ్ని, పద్మ, స్కాంద, శివ, గరుడ మొదలైన పురాణాలలో శివరాత్రి పర్వదిన ప్రశంస కనబడుతున్నది.

వీటిలో తాత్పర్యం ఒకటే. ఈ పర్వదినానికి సంబంధిం చిన అనేక కథలు పురాణాలలో ప్రసిద్ధిచెందాయి. అసలు మాఘబహుళ చతుర్దశి తిథినాడే మహాశివరాత్రి పండుగని ఎందుకు చేసుకోవాలి? అన్న ప్రశ్నకు సమాధానంగా మనకొక కథ కనిపిస్తున్నది.

ఒకసారి బ్రహ్మాదిదేవతలతో సహా సమస్త సృష్టి ప్రళ యంలో లీనమైపోయింది. ఆ సమయంలో కాత్యాయనీదేవి సృష్టిబీజాలనన్నింటినీ ఒక మహాపద్మంలో భద్రం చేసి ఆ పద్మాన్ని తన చేతిలో ధరించి పరమాత్మని ధ్యానం చేస్తున్నది. ప్రళయ సమయం పూర్తయింది. తిరిగి మళ్ళీ సృష్టి చెయ్యటానికి ఆ పరాశక్తి కాత్యాయని పరమశివుణ్ణి ప్రార్ధించింది.

ఆ శక్తి ప్రార్థనని మన్నించి, ప్రసన్నుడై శివుడు ఆమె ముందు ప్రత్యక్షమైనాడు. ఆ రోజు మాఘ బహుళ చతు ర్దశి. అప్పుడు కాత్యాయనీమాత ఓ పరమశివా! ఈ రోజు మాఘ బహుళ చతుర్దశి. ఈ అర్ధరాత్రి రోజున నీవు ప్రత్యక్షమై అంధకారబంధురమైన ఈ రాత్రిని నీ దివ్య తేజస్సుతో ప్రకాశింపచేశావు. కనుక ఈ నాటి నుండి ‘మాఘ బహుళ చతుర్దశి’ మహాశివరాత్రి పర్వదినంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి నీవు సాక్షాత్కరించిన అర్ధరాత్రి సమయంలో నిన్ను పూజించి వాళ్ళు ఇహపర సౌఖ్యాలని అనుభవిస్తా రన్నది, శివుడు తథాస్తు అన్నాడు. అప్పటి నుండి మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినంగా పేరుపొందింది.

*శివరాత్రి మహోరాత్రం నిరాహారో జితేంద్రియః ।*
*అర్చయే ద్వా యథాన్యాయం తథాబలమవంచకః ॥*
*యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరమ్ ।*
*తత్ఫలం లభతే సత్యం శివరాత్రే మదర్చనాత్ ॥*

శివరాత్రి పర్వదినం రోజున ఎవరైతే పగలంతా ఉపవాసం ఉండి ఇంద్రియాలని జయించి శక్తివంచన లేకుండా త్రికరణ శుద్ధిగా నన్ను ఆరాధిస్తారో వారికి సంవత్సర మంతా నాకు పూజచేసిన ఫలితాన్ని ఇస్తానని శివుడు స్వయంగా బ్రహ్మతో చెప్పాడు.

‘జన్మానికొక శివరాత్రి’ అనే సామెత లోకంలో ప్రచారంలో ఉంది. బహుశా ఆ సామెత ఈ పై శ్లోకభావం నుండే పుట్టి ఉంటుంది. మనకి సాధారణంగా రెండు రాత్రులు గుర్తుకు వస్తాయి. చక్కగా ఆనందంగా గడిస్తే శివరాత్రి- లేక పోతే కాళరాత్రి.

ఋగ్వేదంలో రాత్రిసూక్తమని ఒక సూక్తం ఉంది. ఆ సూక్తం రాత్రిని ప్రశంసిస్తుంది. రాత్రి సమయం ఇంద్రియాలు సేద తీరటానికి అనువుగా ఉంటుంది.

వ్యాధిగ్రస్తులు కాని, శోక గ్రస్తులు కాని తమ బాధని పోగొట్టుకోవటానికెంతో అవకాశాన్నిస్తుంది రాత్రి. ఈ విధంగా రాత్రి ఆనందాన్ని కలిగిస్తున్నందువల్ల రాత్రిని ఆనందదాయినిగా సూక్తం ప్రశంసించింది.

*శివం తు పూజయిత్వా యో జాగర్తి చ చతుర్దశీమ్ ।*
*మాతు: పయోధరరసం న పిబేత్ స కదాచన ॥*

శివరాత్రిరోజున ఎవరైతే శివుణ్ణి పూజించి రాత్రి జాగరణ చేస్తారో వాళ్ళకి మళ్ళీ తల్లిపాలు త్రాగే అవకాశం రాదు. అంటే ఆ జీవుడికి మళ్ళీ జన్మలేదని అర్ధం.

*ఉప-సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః ।*
*ఉపవాసః స విజ్ఞేయః సర్వభోగవివర్ణితః ॥*

అన్ని భోగాలని విడచి జీవాత్మ పరమాత్మ సమీపంలో ఉండ టమే ఉపవాసం, అని వరాహోపనిషత్తు ఉపవాసాని కర్ణాన్ని చెప్పింది. భూతశక్తులు శివుడు సంచరించే సమయం రాత్రి సమయం కనుక రాత్రివేళలో శివా రాధన చెయ్యాలి.

మహాశివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి సమయంలో శివాలయాలలో శివారాధనలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి.

యామము లెన్మిదింట నియతాకృతి ప్రత్యహమున్
శివార్చనా రామతయొప్ప నిత్యశివరాత్రి వ్రతంబుగ పూని భవ్య
యోగామృత తృప్తియై త్రిజగదర్పితలీల తనర్చు శంకర స్వామి
మునీంద్రుభక్త జనవత్సలు మద్గురునాశ్రయించెదన్.

అని ‘శంభుదాస’ బిరుదాంకితుడైన ఎఱ్ఱాప్రగడ తమ గురువుగారైన శంకరస్వామివారి శివభక్తిని గురించి చాటి చెప్పాడు.

ప్రాచీనకాలంలో పెద్దలు ఎక్కువ సమయం భగవంతుడికి సంబంధించిన విషయాలపట్ల, ఆరాధనలపట్ల భక్తి శ్రద్ధలతో ఎక్కువ కాలాన్ని గడిపేవాళ్ళు. ఈనాడు ప్రతినిత్యం ఇలా చెయ్యనవసరంలేదు. కనీసం నెలకొక రోజున మాస శివరాత్రినాడైనా సరే చెయ్యగలుగు తున్నారు.

అర్ధానక్షత్రం పరమేశ్వర నక్షత్రమని ఆ రోజున విశేషంగా శివాభిషేకాలు చేస్తారు. ఆర్రా నక్షత్రంలోనే శంకరాంశ సంభూ తులు ఆదిశంకరాచార్యులు అవతరించారు.

సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వారం. ఆ రోజున కూడా శివాలయాలలో విశేషంగా అభిషే కాలు చేస్తారు.

ఇవన్నీ చెయ్యలేకపోయినా కనీసం సంవత్సరానికొక్కసారి మహాశివరాత్రినాడైనా పరమేశ్వరాధన చెయ్యాలి. ప్రతి సంవత్సరం చెయ్యలేకపోయినా జన్మానికొక శివరాత్రిగా జన్మలో ఒక్కసారైనా శివారాధన చేసి తీరాలి.

*శివరాత్రి వ్రతాన్ని ఎలా చేయాలి?*

గరుడ పురాణానుసారం త్రయో దశి రోజునే శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించాలి. మనస్సులో కొన్ని నియమాలని నిర్ధారించుకోవాలి.

స్వామి ముందు ఇలా సంకల్పం. చెయ్యాలి.
ఓ మహాదేవా! శివా! నేను ఈనాటి నుండి దీక్షని స్వీకరిస్తు న్నాను. నేను చతుర్దశిరోజు రాత్రి జాగరణ చేస్తాను. నా భక్తిని శక్తిని అనుసరించి పగటిపూట దానాలు, హోమం, తపస్సు చేస్తాను. శివరాత్రి మరుసటి రోజున మాత్రమే భోజనం చేస్తాను. నాకు ఆనందాన్ని, మోక్షాన్ని అనుగ్రహించు శివా! అని ప్రార్థించాలి. తరువాత గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామికి పంచగవ్యాలతో (ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవు నెయ్యి, ఆవుపేడ, ఆవు పంచితం) పంచామృతాలతో (పాలు, ఫలరసం, తేనె మొదలైనవి) అభిషేకం చేయించాలి. నువ్వులు, బియ్యం కలిపి వండిన అన్నాన్ని ఆవునేతితో కలిపి హోమంలో హవిస్సుగా వెయ్యాలి. తరువాత పూర్ణాహుతిని నిర్వహించాలి.

ప్రత్యేకంగా శివరాత్రి వ్రతాన్ని చేసేవాళ్ళు అర్ధరాత్రి, మూడవ, నాలుగవ జాము లలో కూడా హోమం చెయ్యాలి. మిగిలిన సమయంలో శివకథలను వినాలి. మరునాడు ఉత్తమ బ్రాహ్మణులకు, శివభక్తులకు అన్నదానం. (భోజనం పెట్టాలి). ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి బిల్వదళాలతో అర్చించాలి. ఇవన్నీ ఈనాడు సామాన్యులు చెయ్యలేరనే దేవాలయాలు ఈ కార్యక్రమాలనన్నింటినీ నిర్వహిస్తున్నాయి. శివదేవుడికి సంబంధించిన పురాణప్రవచనాలు, హరికథలు, సంగీత కచేరీలు, నృత్యాలు చేయిస్తున్నాయి.

*శివరాత్రి పర్వదినం రోజున ఎవరైతే పగలంతా ఉపవాసం ఉండి ఇంద్రియాలని జయించి శక్తివంచన లేకుండా త్రికరణ శుద్ధిగా నన్ను ఆరాధిస్తారో వారికి సంవత్సరమంతా నాకు పూజచేసిన ఫలితాన్ని ఇస్తానని శివుడు స్వయంగా బ్రహ్మతో చెప్పాడు.*

సంవత్సరానికొక్కసారి వచ్చే మహాశివరాత్రినాడు మాత్రమే భారీగా మనం చెయ్యగలుగుతున్నాం. కానీ ఆనాడు శంకరస్వామి నిత్య శివరాత్రివ్రతంగా ఎనిమిదిజాములు అభిషేకం చెయ్యటమనేది ఎంత ఆశ్చర్య కరమో కదా! పరమశివుడు భోళాశంకరుడు. ఈ స్వామి సర్వసులభుడు. ఈ స్వామి సౌలభ్యాన్ని ఈ చిన్నపద్యం ఎలా తేటతెల్లంగా చెబుతున్నదో గమనిద్దాం.

*గరళకంఠుని శిరసుపై నీరు చల్లి*
*పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు*
*అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు*
*కామధేనువు వానింటి గాడిపశువు.*

స్వామి తలపై కొంచెం నీళ్ళు పోస్తే అభిషేకం చేసినంత ఆనందాన్ని పొందుతాడు. పత్రిని (మారేడు దళాన్ని) తలపై వేస్తే పరవశిస్తాడు. ఇలా చేసిన వాడింటికి కల్పవృక్షం వచ్చి నిలుస్తుంది. అంటే కోరికలన్నీ తీరుస్తుంది. కామధేనువు వాడింట్లో గాటికి కట్టివేసిన పశువౌతుంది. కల్పవృక్షం కామధేనువు ఇంటి ప్రాంగణంలో ఉంటే ఇంక కొదువేముంటుంది?

మహర్షులు కూడ శివుడే భోక్త, శివుండె కర్త శివుడే చేయున్ మఖాదిక్రియల్ అంటూ శివోహం అనే భావాన్ని పొందుతారు. నిజానికి మనమంతా శివులమే. శివుడు మనలో ప్రాణశక్తి రూపంగా ఉన్నాడు. ఆ స్వామి మనలో లేకపోతే గుడిపోయి (శి శ్+ఇ) తలకట్టు చేరి (శ్+అ) ‘శ’ అయితే (శవం) ఎవ్వరూ పట్టించుకోరు.

శివశబ్దానికి అర్థాన్ని ఈ శ్లోకం చక్కగా వివరిస్తున్నది.

*శం సుఖం పరమానందం ఇకారః పురుషః స్మృతః |*
*వ కారం శక్తిరమృతం శివ ఇత్యుచ్యతే బుధైః ॥*

_శివనామంలో నాలుగు అక్షరాలున్నాయి. శ్+ఇ = శి వ్+అ = వ_

ఈ విభజన ప్రకారం శకారం సుఖాన్ని పరమానందాన్ని కలిగిస్తుంది. శివనామానికి పర్యాయపదంగా వాడే శంకర శబ్దంలోని శకారానికి కూడా శం కరోతి- సుఖాన్ని కలిగించే వాడు అనే అర్థం. ఇ కారం పరమపురుషత్వాన్ని (శ్రేష్ఠత్వాన్ని) వకారం అమృత బీజమైనందువల్ల అమృతత్త్వాన్ని అకారం విష్ణుబోధకమైనందు వల్ల స్థితిని కలిగిస్తుంది.

సంస్కృత సాహిత్యంలో అప్పయ్య దీక్షితులవారు శివకర్ణా మృతమనే ఒక అద్భుత గ్రంథాన్ని రచించారు. తెలుగు సాహిత్యంలో పాల్కురికి సోమనాథుడు మహాశివ భక్తుడు. కవిసార్వభౌముడైన శ్రీనాథుడు ఈశ్వరార్చన కళా శీలుడు.

అంతేకాదు ఎంతటి నికృష్ణుడైనా మహాశివరాత్రి నాడు అర్చన చేసినా, స్వామిని దర్శించినా వాడు పుణ్యాత్ముడై ముక్తిని పొందుతాడనే విషయాన్ని తన శివరాత్రి మాహాత్మ్యం అనే కావ్యం ద్వారా లోకానికి చాటి చెప్పాడు.

*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏