ఆందోళన కలిగించే ఒక పెద్ద మార్పు..
2022లో 14.9 కోట్లు ఉన్న వృద్ధుల సంఖ్య 2031లో 19.4 కోట్లకు చేరుతుందని, 2050 నాటికి ఈ సంఖ్య ఏకంగా 34.7 కోట్లకు పెరుగుతుందని వివరించింది. మొత్తం జనాభాలో 2022లో 10.5 శాతంగా ఉన్న వృద్ధుల సంఖ్య 2050 నాటికి 20.8 శాతానికి చేరుతుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో కేర్ గివింగ్ (సంరక్షణ) రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేసిన నీతి ఆయోగ్, ఇందుకు సంబంధించి జాతీయ ‘సంరక్షణ’ విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది.
దేశంలో కేర్ ఎకానమీ అభివృద్ధికి నియంత్రణ సంస్థ (నేషనల్ కేర్ గివింగ్ కౌన్సిల్) ఏర్పాటును ప్రతిపాదించింది. 2023లో 2,962 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.2.78 లక్షల కోట్లు) ఉన్న భారత సంరక్షణ సేవల మార్కెట్ 2030 నాటికి 7,231 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.80 లక్షల కోట్లు) చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. వ్యవస్థీకృత సంరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. ‘వికసిత్ భారత్ : 2047లో సంరక్షకులకు సాధికారత.. సంరక్షణ రంగానికి కొత్త వ్యూహాలు’ పేరుతో రూపొందించిన నివేదికలో ఈ అంశాలను స్పష్టంచేసింది. నివేదికలోని మరికొన్ని అంశాలు..
వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక సంరక్షణ అవసరమయ్యే ఇతరులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, సంరక్షణ సేవలను వృత్తిపరంగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మహిళల కార్మిక భాగస్వామ్యం మెరుగుపడుతుంది.
» శిక్షణ పొందిన సంరక్షణ సిబ్బందిని అందించే విశ్వసనీయమైన గ్లోబల్ హబ్‌గా భారత్‌ను నిలబెట్టేందుకు ఇది దోహదపడుతుంది.
» సంరక్షకులను, సంరక్షణ అవసరమైన వారిని అనుసంధానించడంతో పాటు సేవలకు సులభంగా చేరుకునేలా జాతీయ డిజిటల్ కేర్ గివింగ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి.
» సంరక్షకుల పని పరిస్థితులను మెరుగుపరచడంతోపాటు మరింత వ్యవస్థీకృతమైన, నైపుణ్యవంతమైన, సుస్థిరమైన సంరక్షణ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి. ఇందులో భాగంగా సంరక్షకులకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలి.
» దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులు ఉన్న నేపథ్యంలో వ్యవస్థీకృత సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.