పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు శుభవార్త…!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఒక భారీ పథకాన్ని ప్రకటించారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్న యువతకు నెలకు రూ. 1500 నిరుద్యోగ భృతి అందిస్తామని స్పష్టం చేశారు. ‘యువసాథి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా కోల్‌కతాలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు…నిజానికి యువసాథి పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని ముందుగానే అమల్లోకి తెస్తున్నట్లు సీఎం వెల్లడించారు. నేటి నుంచే అర్హులైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఆర్థిక సాయం నిరుద్యోగులు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు తోడ్పడుతుందని దీమా వ్యక్తం చేశారు. యువత స్వయం సమృద్ధి సాధించి మెరుగైన భవిష్యత్తు వైపు పయనించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆమె వివరించారు.

ఈ పథకానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే ఈ భృతి పొందేందుకు అర్హులు. కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి. ప్రస్తుతం ఎటువంటి ఉపాధి లేని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల నిరుద్యోగులకు తక్షణ ఉపశమనం లభించడంతో పాటు వారి పోటీ పరీక్షల ఖర్చులు లేదా చిన్నపాటి శిక్షణలకు ఈ నిధులు ఉపయోగపడతాయి.

తమ పాలనలో పశ్చిమ బెంగాల్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మమతా బెనర్జీ గర్వంగా ప్రకటించారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 40 శాతం మేర తగ్గిందని గణాంకాలతో వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. దాదాపు 40 లక్షల మంది యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించామని తెలిపారు. వారిలో ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు బెంగాల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. తద్వారా మరిన్ని వేల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.