Paraquat Ban.
_రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు బాధ్యత_
_మనుషులు, జంతువులకు ప్రమాదం ఉందని నిపుణుల కమిటీ సిఫార్సు_
_హైదరాబాద్: మనుషులు, జంతువులకు ప్రమాదం ఉన్నందున పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది._
_ఈ మేరకు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కీటకనాశక చట్టం-1968లోని సెక్షన్ 27(2), 28 కింద ఈ నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీ సిఫార్సులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ కమిటీతో సంప్రదింపుల తర్వాత కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గెజిట్లో ఉత్తర్వు ప్రచురించిన సెప్టెంబర్ 22 నుంచే పారాక్వాట్ డైక్లోరైడ్కు కొత్త రిజిస్ట్రేషన్లు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.._
_కీటకనాశక చట్టంలోని సెక్షన్ 9 కింద ఇప్పటికే జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా అదే తేదీ నుంచి రద్దయినట్లుగా పరిగణిస్తారు. వాటిని వెనక్కి తీసుకోవాలని రిజిస్ట్రేషన్ కమిటీని ఆదేశించింది. సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కేంద్ర ఉత్తర్వులను రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కీటకనాశక చట్టం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. పారాక్వాట్పై నిషేధం విధించే ఉద్దేశాన్ని కేంద్రం జూలై 10న నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేసినట్లు గెజిట్లో పేర్కొంది._