నేటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం..

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు రెండో విడత నేటి నుంచి ప్రారంభం కానున్నాయి… దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం,,ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌)లో వడ్డీ రేట్లు తగ్గింపు,రైతులకు కనీస మద్దతు ధర, రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి…బడ్జెట్‌ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోద ముద్ర, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన బడ్జెట్‌ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం అజెండాలో ప్రధానమైనవి. సోమవారం లోక్‌సభ కార్యకలాపాలు మొదలు కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కశ్మీర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత సమావేశాల్లో దానిపై చర్చ జరుగుతుంది. రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌) ఆదేశాల (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రావడంతో పార్లమెంటు ఉభయ సభలు యథావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయి. ఈ సారి సమావేశాలు ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన పూర్తికానున్నాయి.

ప్రతి అంశం పై చేర్చ జరపాలి : కాంగ్రెస్‌..

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఉదయం పార్టీ పార్లమెంటు వ్యూహాల గ్రూప్‌ సభ్యులతో సమావేశమయ్యారు. సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలతో సమన్వయంతో పని చేయాలని నిర్ణయానికొచ్చారు. బడ్జెట్‌ రెండో విడత సమావేశాల్లో ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తి, వాటిపై చర్చ జరిగేలా చూస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే వెల్లడించారు.