విమానంలో పేలిన పవర్ బ్యాంక్..

విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీల విషయంలో మరోసారి కలకలం రేగింది. తాజాగా చైనాలోని ఓ ప్రయాణికుల విమానంలో ఓవర్‌హెడ్ లగేజ్ బిన్‌లో ఉంచిన పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఒక్కసారిగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్యాబిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడగా, విమానయాన సంస్థలు పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీల వినియోగంపై అమలు చేస్తున్న భద్రతా నిబంధనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నాసిరకం లేదా దెబ్బతిన్న పవర్ బ్యాంకులు అధిక వేడికి గురైతే ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులు కూడా నాణ్యమైన, భద్రతా ప్రమాణాలు కలిగిన పవర్ బ్యాంకులనే ఉపయోగించాలని సూచిస్తున్నారు.