ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ప్రధానికి ఎనర్జీ(శక్తి), ఎగ్జైట్మెంట్(ఉత్సుకత), ఎంథూజియాజం(ఉత్సాహం) అనే ‘3ఈ’లు మాత్రమే ఉన్నాయని తెలిపింది. తల్లడిల్లుతున్న మణిపుర్‌కు వెళ్లేందుకు ఎంపథీ (సానుభూతి) అనే నాలుగో ‘ఈ’ లేదని . ఆదివారం సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల పర్యటనకు మోదీ వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
‘2023 మే నుంచి ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లడం ఇది 35వ సారి అని, ఇంత సుదీర్ఘ వ్యవధిలో ఒక్కసారి కూడా మణిపుర్‌కు వెళ్లే తీరిక మోదీకి దొరకకపోవడం దారుణం. మణిపుర్ రాష్ట్రాన్ని అత్యంత దారుణ రీతిలో ప్రధాని మోదీ విస్మరిస్తున్నారు. అక్కడి ప్రజల గోడును వినాలనే ఆసక్తే ఆయన లేదు. 2023 మే 3 నుంచి మణిపుర్‌కు చెందిన ఏ ఒక్కరినీ మోదీ కలవలేదు. సానుభూతి భావన(నాలుగో – ఈ) ఉన్నవాళ్లు ఎవరైనా సరే మణిపుర్ ప్రజల బాధను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ప్రధాని మోదీకి నాలుగో ఈ లేదు’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
‘కెనడా, భారత్ బంధంపై మోదీ అంచనాలు తలకిందులు’
‘కెనడా, భారత్‌లు (a+b)^2 సూత్రంలా ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటాయని 2015లో ప్రధాని చెప్పారు. మోదీ చెప్పింది అక్షరాలా తప్పు అని కాలక్రమంలో తేలిపోయింది. మారిన పరిస్థితులే అందుకు నిదర్శనం’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ అంశంపై 2015లో మోదీ చేసిన వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియో క్లిప్‌ను ఆయన తన ట్వీట్లో షేర్ చేశారు.