తెలంగాణలో ఆయన గెలవలలేడు. రాహుల్ గాంధీ కూడా ఆయనను రక్షించలేరు… ప్రశాంత్ కిషోర్..!!

ఏదో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ నవికా కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ పలు అంశాలపై స్పందించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా ఇండి కూటమి నేతలపై జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీరు బీహార్ ప్రజలపై దూషణలు చేశారని… బీహార్ ప్రజలకు కూడా దేవుడు సమయం ఇస్తాడని, అప్పుడు వీరంతా జవాబుదారీగా ఉండాల్సిందేనని అన్నారు. ”మీరు స్టాలిన్‌కు సలహాదారునిగా ఉన్నారుగా?” అని ప్రశ్నించగా… గతంలో ఉన్నానని చెప్పారు. అయితే బీహార్ ప్రజలను దూషణలు చేసే ఎవరికి కూడా సలహాలు ఇవ్వడం జరగదని తెలిపారు. నెక్ట్స్ టైమ్ వారి అకౌంట్స్ సెటిల్ చేస్తామని హెచ్చరించారు. దేవుడు అవకాశం ఇచ్చి సమయం కల్పిస్తే… వారి లెక్కలు తేలుస్తామని అన్నారు.

”మీరు చాలా పెద్ద మాటలు చెబుతున్నారు?” అని అడగగా… ఇందులో పెద్ద విషయం ఏమి లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ”రేవంత్ రెడ్డి స్టేటస్ ఏమిటి?, ఆయన తొలి సారి ముఖ్యమంత్రి అయ్యారు. బీహార్ ప్రజల డీఎన్‌ఏ తెలంగాణ ప్రజల కంటే దారుణంగా ఉంటుందని చెప్పే ధైర్యం ఆయనకు ఉంది. అలా అన్నప్పుడు నెక్ట్స్ ఎన్నికలు జరుగుతాయి కదా… మేము తెలంగాణకు వెళ్లి ఆయన లెక్క తేలుస్తాం… అప్పుడు ఎవరు చెడ్డవారో, ఎవరు మంచివారో తేల్చుకుంటాం.. మేము ఎవరికీ భయపడం. ఈ మాట నేను కెమెరాల ముందే చెబుతున్నాను… వాళ్లు వారి శక్తినంతా ఉపయోగించుకోవచ్చు” అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించగా… ”రాహుల్ గాంధీని ఎవరు పట్టించుకుంటారు? మేము ఎవరికీ భయపడము. మేము భయపడటానికి పుట్టలేదు. బీహార్ ప్రజలను తక్కువ చేసి మాట్లాడుతున్నవారు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈసారి రేవంత్ రెడ్డిని ఓడించడానికి మా శక్తిని ఉపయోగిస్తాం. తెలంగాణలో ఆయన గెలవలలేడు. రాహుల్ గాంధీ కూడా ఆయనను రక్షించలేరు. ఎవరూ ఆయనను రక్షించలేరు” అని చెప్పారు.

తెలంగాణలో బీహార్ ప్రజలను దూషిస్తూ రాజకీయాలు చేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. తాము ఎవరి గురించి అయినా అనుచితంగా మాట్లాడుతున్నామా? అని ప్రశ్నించారు. బీహార్ ప్రజలు వారి పొలాల్లో పనులు చేస్తున్నారుగా… మరి వారిని ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించారు. వారు బీహార్ ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే… తాము తెలంగాణకు వెళ్లి తేల్చుకుంటామని అన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తెలంగాణ డీఎన్‌ఏ కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ తక్కువది అయితే… తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డి తన వద్ద సలహా తీసుకోవాలని ఎందుకు చూశారని ప్రశ్నించారు.

”రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రశాంత్ కిషోర్ సహాయం కోసం వచ్చారా? లేదా?… తెలంగాణ డీఎన్‌ఏ కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ తక్కువది అయితే… మీరు మా సలహా కోరేందుకు ఎందుకు వచ్చారు?. మీరు తెలివిగల వారే అయితే… ఇక్కడికి ఎందుకు వచ్చారు?, దమ్ముంటే సమాధానం చెప్పండి” అని రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.!?