ఏపీ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై చిరంజీవి కూడా ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి స్పందించారు. జగన్ ప్రభుత్వం సినిమా వాళ్లు ఎవరినీ అవమానించలేదని కుండబద్ధలు కొట్టారు…ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్పై చిరంజీవి స్పందన 100 శాతం నిజమని ఆర్.నారాయణమూర్తి తెలిపారు. జగన్ను కలిసిన వాళ్లలో తాను కూడా ఉన్నానని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఎవరినీ అవమానించలేదని స్పష్టం చేశారు. చిరంజీవి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవమిచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం చిరంజీవిని, సినిమా వాళ్లను అవమానించారనే ప్రచారం అసత్యమని పేర్కొన్నారు.
చిరంజీవి నాకు స్వయంగా ఫోన్ చేశారు.. అది ఆయన సంస్కారమని ఆర్.నారాయణమూర్తి అన్నారు. అందరం చిరంజీవి ఇంట్లో కలిశాం. అనంతరం చిరంజీవి పరిశ్రమ పెద్దగా అప్పటి సీఎం జగన్తో మాట్లాడారని తెలిపారు. చిరంజీవి వల్లే ఆరోజు సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. బాలకృష్ణ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని అన్నారు…
మౌనం వీడుతున్న సినీ ప్రముఖులు :
ఇదిలా ఉంటే జగన్ సినీ ప్రముఖులను ప్రత్యేకించి చిరంజీవిని అవమానించారు అన్నది చిన్న విషయం ఏమీ కాదు, అయిదు దశాబ్దాల సినీ చరిత్రతో పాటు కోట్లాది మంది అభిమానులను కలిగి మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవిని అవమానించడం అంటే అది ఏ మాత్రం లైట్ గా తీసుకునేది కాదు, సినీ హీరోలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. వారు తన సొంత కుటుంబంగా ఆరాధిస్తారు. అలాంటిది అందరికీ అవమానించారు అంటే ఆ ప్రభావం రాజకీయంగా ఎంతో దెబ్బ తీస్తుందో అందరికీ తెలిసిందే. అదే వైసీపీ విషయంలో జరిగింది. ఒక రోజూ రెండు రోజులు అని కాదు ఏకంగా అయిదేళ్ల పాటు ఇదే తీరున ప్రచారం అయితే సాగింది. కానీ ఆనాడు పెద్దగా ఎవరూ రియాక్ట్ కాలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇపుడు మెగాస్టార్ పెదవి విప్పడం తో సినీ ప్రముఖులు అంతా మౌనం వీడుతున్నారని గుర్తు చేస్తున్నారు..