భూ లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఈడీ మంగళవారం ఐదుగంటలకు పైగా ప్రశ్నించి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. బుధవారం మరోసారి విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది..
తాను భాజపాలో చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన బుధవారం అన్నారు. ”నేను ఒక సామాజిక కార్యకర్తను. 1999 నుంచీ ప్రజల కోసం పనిచేస్తున్నాను. త్వరలో రాజకీయాల్లోకి వస్తాను” అని ఆయన అన్నారు. 2008లో ఒక భూమి కొనుగోలుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆయన బుధవారం రెండోరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. వాద్రాకు చెందిన కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రాంలోని షికోపుర్లో రూ 7.5 కోట్లు విలువ చేసే 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసిందని, తర్వాత ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించిందని ఈడీ వాదిస్తోంది. రాబర్ట్ వాద్రా తన భార్య, ఎంపీ ప్రియాంకాగాంధీతో కలిసి ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.10కి ఆయన భోజనం చేయడానికి ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు.