తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై అసంతృప్తి చెందిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. (MLA Raja Singh Resign) ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే..రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయాలని వస్తే వేయనివ్వలేదని వాపోతూ.. జూన్ 30న పార్టీకి రాజీనామా చేసి, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దానిని అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు హైకమాండ్ ఆమోదం తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించారు.
కాగా.. రాజాసింగ్ తో పాటు మరో ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతో కష్టపడ్డానని, తన సర్వం పార్టీ కోసం ధారపోస్తే.. కనీసం విలువ ఇవ్వలేదని రాజీనామా చేసిన రోజున ఆరోపించారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ.. పార్టీ ఆఫీసులో రాజీనామా లేఖను అందజేశారు. బీజేపీకి రామ్ రామ్ చెప్పిన రాజాసింగ్.. తదుపరి ఏ స్టెప్ తీసుకోనున్నారు ? ఆయన రాజకీయ భవిష్యత్ ను ఏ పార్టీతో కొనసాగిస్తారన్నదానిపై సందిగ్ధత నెలకొంది. కొందరు జనసేనలోకి వెళ్తారని అంటుండగా.. మరికొందరు ఏదో ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు..