మామునూర్ ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌ ట్వీట్‌ ఎయిర్‌పోర్టు కల సాకారం కాబోతోంది.

మామునూర్ ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌ ట్వీట్‌
ఎయిర్‌పోర్టు కల సాకారం కాబోతోంది.

ఎయిర్‌పోర్టుకు మంచి పేరు సూచించాలంటూ ట్వీట్‌

ట్వీట్‌కు స్పందించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా
రుద్రమ లేదా కాకతీయ పేరు పెట్టాలన్న సందీప్‌రెడ్డి
స్పిరిట్‌ అంటే ఇదేనంటూ బదులిచ్చిన సీఎం రేవంత్‌
.

వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు చేపడుతున్న చర్యలు కీలక దశకు చేరుకున్నాయి. అనుమతుల దగ్గర నుంచి భూసేకరణ, సాంకేతిక పరమైన పరిశీలన దశలను దాటుకొని నిర్మాణ పనులను 3 ప్యాకేజీలుగా చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. ఇప్పటికే 2 ప్యాకేజీల పనులకు వేర్వేరుగా టెండర్లు పిలిచి ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే.

కొత్త గేట్‌వే విమానాశ్రయం

మామునూరులో రానున్న కొత్త ఎయిర్‌పోర్టుకు ఏం పేరు పెట్టాలో సూచించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. వరంగల్‌లో ప్రపంచ స్థాయి విమానాశ్రయం కల సాకారం కాబోతోందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. మామునూరు విమానాశ్రయం ఏర్పాటు కోసం చురుగ్గా జరగుతున్న ప్రక్రియలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎక్స్‌లో సీఎం పోస్ట్ చేశారు.

బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ వరంగల్ విమానాశ్రయం కలను నిజం చేయలేకపోయిందన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కేవలం తమ కుటుంబ ప్రయోజనాలు, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లపైనే దృష్టి పెట్టారని వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రజపాలనలో ఇప్పుడు వరంగల్ ఎయిర్‌పోర్ట్ కల సాకారం అవుతోందని స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయం భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.295 కోట్ల కేటాయించడంతో పాటు అవసరమైన భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో కల రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.

ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు పెట్టుబడులకు కొత్త గేట్‌వే అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అభివృద్ధి చెందుతున్న, అనుసంధానించబడిన తెలంగాణ రాష్ట్రానికి కొత్త చిహ్నంగా నిలవనున్న వరంగల్ మామునూరు విమానాశ్రయం నుంచి ప్రయాణించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.