సంక్రాంతి విశిష్టత…

*సంక్రాంతి విశిష్టత..*
సంక్రాంతి పండగంటే.. అదో ఆనందం. చదువులు, వృత్తులు, ఉద్యోగాలు, ఉపాధి అంటూ.. ఊరు విడిచిన వాళ్లందరినీ.. మళ్లీ ఒక చోటుకు చేర్చే పండుగ. కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల బంధాలని.. మూడు, నాలుగు రోజుల పాటు జరుపుకునే గొప్ప పండుగ సంక్రాంతి. ఏ మూలన ఉన్నా.. పల్లెకి తీసుకొచ్చి మూలాల్ని గుర్తు చేసే సంబరం ఇది. పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. నగరాలు, పట్టణాల్లో ఉన్నోళ్లంతా.. పల్లె బాట పడతారు. తెలుగు ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే పండగల్లో.. సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉంది..

నెలకో రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అనే అంటారు. కానీ ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం పెద్ద పండుగ జరుపుకుంటారు. మూడు రోజుల పాటూ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి… ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పండుగ ఎలా అయిందో తెలుసుకుందాం. .దక్షిణదిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకూ ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటుచేసుకుంటాయి. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో పెద్దగా మార్పులుండవు.

సంక్రాంతినే పెద్ద పండుగ అంటారెందుకు…

సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటూ రైతులు మనసు నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకుని తినరు..ఎందుకంటే.. కొత్త బియ్యం అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు(సకినాలు) చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్టు ఉంటుంది.. జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు.. అందుకే పొంగల్ అని పిలుస్తారు. మరోవైపు పంటని చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా అన్నీ చేసి నైవేద్యం పెట్టి, ప్రకృతిని, పశువులను పూజిస్తారు… ముగ్గుల పండుగ
సృజనాత్మకతని వెలికితీసే ముగ్గులు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, గొబ్బిళ్లు…ఇలా సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి పద్దతి అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే ఆ మూడు రోజులు మాత్రమే కాదు నెలరోజుల ముందు నుంచీ సందడి మొదలైపోతుంది…………భోగి మంటలు.. బోగిళ్లు.. భోగభాగ్యాల భోగిళ్లతో ప్రారంభమవుతుంది సంక్రాంతి పండుగ. పాతకు పాతరేస్తూ కొత్తను ఆహ్వానించడం భోగి పండుగ లక్షణం. భోగిమంటల సారం. అందుకే పాత వస్తువులన్నీ భోగిమంటల్లో వేసేస్తారు. మనిషికి ప్రకృతి ఆరాధ్య దైవం. అందులోనూ సూర్యుడు అంటే ప్రత్యక్షదైవంగా చూస్తారు. అప్పటి వరకు నరాలను పిండే చలిని అనుభవిస్తూ… వేడి కంటే వేడి కలిగించాలనే సూచికగా భోగిమంటను వేస్తారు. అంతేకాదు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన సందర్భంగా కావడంతో వేసవికి స్వాగతం పలికేదిగా కూడా భోగిమంటగా వర్ణిస్తారు. భోగి పండుగ రోజు తెలుగు లోగిళ్లలో ఎంతో సందడి ఉంటుంది……..

*గంగిరెద్దుల ప్రత్యేకత..*

భారతీయ జీవన విధానంలో పశు సంపదకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. ఆవును గోమాతగా భావిస్తే, ఎద్దు.. నందీశ్వరుడిగా (శివుడి వాహనంగా) పూజలు అందుకొంటున్నది. ఆ పాడి పశువులే ప్రధాన పాత్రధారులయ్యే జానపద కళారూపం ‘గంగిరెద్దులాట’.. మన సంస్కృతిలోనూ భాగమైంది. పూర్వకాలం నుంచీ మనుగడలో ఉన్న ఈ కళ.. పల్లెవాసులతోపాటు పట్టణవాసులనూ అలరిస్తున్నది………

*ఆకట్టుకొనే అలంకరణ.*

గంగిరెద్దుల అలంకరణ ఆకట్టుకునేలా ఉంటుంది. ఉన్నంతలో అందంగా తీర్చిదిద్దుతారు. బట్టలను బొంతలుగా కుట్టి, వాటికి అద్దాలు పొదుగుతారు. మరింత ఆకర్షణ కోసం చెమ్కీ దండలు జతచేసి, మూపురం నుంచి తోక వరకూ కప్పుతారు. ముఖం దగ్గర రంగుల తోలు కుచ్చు, మూతికి తోలుతో కుట్టిన శిఖమారు కడుతారు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి బసవన్నను అలంకరిస్తారు. వాటిని ఆడించే కళాకారులూ ప్రత్యేకంగా ముస్తాబవుతారు. నెత్తికి రంగుల తలగుడ్డ, మూతిమీద కోరమీసాలు, చెవులకు కమ్మల జోడు, పాత కోటు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తా రు. సన్నాయి బూర, డోలు, చేతిలో చిన్న కంచు గంట పట్టుకొని ప్రదర్శన నిర్వహిస్తారు. ఆటతోపాటు గాత్రంతోనూ వినోదాన్ని పంచుతారు. సన్యాసమ్మ, రాములోరు, గంగరాజు, ఈశ్వరమ్మ, వీరగున్నమ్మ పాటల్లాంటివి పాడతారు………

*ప్రాచీనకాలం నుంచే* ..

‘గంగిరెద్దుల వాడు కావరమణచి ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు’

అని ‘పలనాటి వీర చరిత్ర’లో శ్రీనాథుడు ఉదహరించాడు. దీనిని బట్టి ప్రాచీనకాలం నుంచే ఈ గంగిరెద్దులాట ప్రచారంలో ఉన్నదని తెలుస్తున్నది. గంగిరెద్దులవాళ్లు ఎద్దులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. గంగిరెద్దు చనిపోతే, మనిషికి చేసినట్టే అంత్యక్రియలు చేస్తారు. దినకర్మలూ నిర్వహిస్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన గంగిరెద్దులాట, నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకొన్నది. ఈ కళను నమ్ముకొని తరాలుగా జీవనం సాగించిన వేలాది కుటుంబాలు, ప్రస్తుతం ఆదరణలేక ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నాయి….

సంక్రాంతి పండగ కు... రేగు పళ్లకు కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగ సమయంలో రేగి పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతికి ముందు భోగి పండుగ వస్తుంది. భోగి రోజున చిన్న పిల్లలకు తల స్నానం చేయించి.. ఎంత మంది పిల్లలు ఉన్నా.. వారికి రేగి పండ్లను పోస్తారు. వారి మీద నుంచి పోసిన రేగు పండ్లను పట్టుకుని తింటూంటారు. దీని వల్ల వారికి చాలా మంచి జరుగుతుందని, పిల్లల ఆయుషు పెరుగుతుందని పెద్దలు విశ్వసిస్తారు. ఈ రకంగా అయినా పండ్లను తినడం వల్ల మంచి జరుగుతుందని ఓ నమ్మకం ఉంది..