సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలు…బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌..

సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాలోతు కవితతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు..గత 9 నెలలుగా తమ భూములు ఇవ్వమని లగచర్ల రైతులు చెబూతునే ఉన్నారని సత్యవతి రాథోడ్‌ అన్నారు. భూములు తీసుకుంటామంటే ఆవేశంలో కొంతమంది దాడి చేశారని చెప్పారు. దాన్ని సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అర్ధరాత్రి కరెంట్ తీసేసి, ఇంటర్ నెట్ బంద్ చేసి మహిళలను హింసించారని.. కొట్టారని.. బూతులు తిట్టారని అన్నారు. 51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని.. ఊళ్లో ఉన్న మగవాళ్లంతా పారిపోయారని చెప్పారు. మళ్లీ ఏం చేస్తారోనని ఇప్పటికీ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ధర్మ పోరాటానికి అండగా ఉండాలని రైతులు అన్ని పార్టీల నాయకులను కోరారని సత్యవతి రాథోడ్‌ తెలిపారు. బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ కూడా పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంకా అరెస్ట్ లు చేస్తున్నారని పేర్కొన్నారు.

బాధితులకు ఉరి శిక్ష పడుతుందని రేవంత్ రెడ్డి సోదరుడు బెదిరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ భూములు గుంజుకుంటామని చెబుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీలో మాత్రమే న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడకు వచ్చామని తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్ ను కలిసి పోలీసులు చేసిన అఘాయిత్యాలపై వివరించామని స్పష్టం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళ కమిషన్ ను కూడా కలుస్తామని వెల్లడించారు. న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు.. రాష్ట్రపతి కూడా ఆదివాసీ బిడ్డే అని.. ఆమె మాకు సమయం ఇస్తే వారికి కూడా ఈ సంఘటనను వివరిస్తాని తెలిపారు. కొద్ది రోజులుగా బాధితుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని అన్నారు. లగచర్ల బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని తెలిపారు..