సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య.. కాపాడిన స్థానికులు..!

సెల్ఫీ దిగుదాం అని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లి అతడిని నీటి ప్రవాహంలో తోసేంది ఓ భార్య. ఇద్దరు బైక్‌పై వెళ్తూ కృష్ణా నది పరవళ్లతో ఫొటో తీసుకుందాం అంటూ బ్రిడ్జిపై ఆపిన భార్య..సెల్ఫీ మాటున భర్తను అందులోకి తోసేసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ, కర్ణాటక బార్డర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తి నగర్‌కు చెందిన తాతప్ప, అతని భార్య ఇద్దరు కలిసి మోటార్ సైకిల్‌పై వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంట, రాయచూరు జిల్లాలోని కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జి వద్దకు రాగానే మోటార్ సైకిల్‌ను ఆపారు. కృష్ణమ్మ పరవళ్లను చూసి భార్యాభర్తలు ఫొటో దిగుదాం అనుకున్నారు. బ్రిడ్జి అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో తాతప్ప కృష్ణానదిలో పడిపోయాడు. అతడికి ఈత కూడా రాకపోవడంతో ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ రక్షించాలని గట్టిగా కేకలు పెట్టాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న క్రమంలో నది మధ్యలో బండరాళ్లు దొరకడంతో దానిపైకి చేరాడు. అతడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పొడగాటి తాళ్లను నదిలోకి వేసి సురక్షితంగా బయటకు తీశారు.

అయితే నది నుంచి ఆవేశంగా బయటకు వచ్చిన తాతప్ప తన భార్యే నదిలోకి తోసేసిందని ఆరోపించాడు. సెల్ఫీ దిగుదామని బ్రిడ్జి అంచుకు తీసుకువచ్చి నీటి ప్రవాహంలోకి తోసివేసిందని చెప్పాడు. నదిలో ఉండి కూడా తాతప్ప అదే ఆరోపణ చేశాడు. బయటకు వచ్చిన అతడు భార్యపై దాడికి యత్నించాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భార్యే నదిలోకి తోసేసిందని చెప్పాడు. తాతప్పను కాపాడిన స్థానికులు భార్యభర్తలకు నచ్చజెప్పి ఇంటికి పంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
https://x.com/pulsenewsbreak/status/1943952161408528489?t=_lYvGdoIGhptxTDJiTHhiw&s=19