తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌..

*తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌*

*బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలపై నిర్ణయం*

*వచ్చే నెల బడ్జెట్ సమావేశంలో చట్టం చేసి పంపిస్తాం*

*42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు మా లక్ష్యం-భట్టి.

బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరోసారి కులగణన చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది.గతంలోనే ఓసారి కుల గణన చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలోనే చట్టం చేస్తామని, ఆ తర్వాత పార్లమెంట్‌కు పంపుతామని వెల్లడించారు. 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని భట్టి తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy Cm Batti Vikramarka) మాట్లాడుతూ 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే గత కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 16 నుంచి 28 వరకూ ప్రభుత్వ సిబ్బంది కులగణన సర్వే నిర్వహించనుందని భట్టి తెలిపారు…

రాష్ట్రంలో బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వాలని భారీగా డిమాండ్ వినిపిస్తున్న విషయం విదితమే. దీంతో తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ వేసింది. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ బడ్జెట్ సమావేశంలో చట్టం చేసి కేంద్రానికి పంపాలని చూస్తోంది..