*సర్పంచ్ ఎన్నికలు.. 890 గ్రామాలు ఏకగ్రీవం*
TG: తెలంగాణలో 890 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేశామని వివరించారు…
పల్లె పోరులో సర్పంచి అభ్యర్థుల ప్రస్తుత ‘స్థితిగతులు’ ఎటూ చెప్పలేని పరిస్థితితో ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఆస్తులు తెగనమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతులు అయితే ఎలాగో మేనేజ్ చేస్తుండగా, ఇబ్బందులున్న వారు తమ స్థిరాస్తులు అమ్ముకునేందుకు, తనఖా పెట్టుకునేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇంకొంత ఖర్చు చేశావంటే నువ్వు సర్పంచిగా గెలవటం ఖాయమని అంటున్నారు. పోటీ అభ్యర్థి మగవాళ్లకు దావత్లు, ఆడవాళ్లకు ఓటుకు ఇంత ఇస్తున్నారు. నువ్వు కూడా ధైర్యం చేయాల్సిందే అంటూ అభ్యర్థులను ఎగేసే వారే ఎక్కువైపోయారు.
‘అన్నా జర నా ప్లాట్ కొనరాదే. సర్పంచిగా నిల్సున్నా. పైసలు అక్కర పడ్డయి’ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచి అభ్యర్థి అభ్యర్థన ఇది.
‘మామా యాదగిరిగుట్టలో ఓ ఫ్లాట్ను రెండు సంవత్సరాల కింద కొనుగోలు చేసిన. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. డబ్బులు కావాలే. ఫ్లాట్ కొనేే! యాదాద్రిలోని బొమ్మలరామారంలో మరో సర్పంచి అభ్యర్థి వేడుకోలు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని మరో గ్రామానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఖర్చుల కోసం గ్రామంలో ఉన్న స్థలాలను అమ్ముకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లలో ఓ సర్పంచి అభ్యర్థి కరీంనగర్లో రూ.80 లక్షలు విలువ చేసే 200 గజాల ఖాళీ స్థలాన్ని రూ.50 లక్షలకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఉన్న ఒక్క ఖాళీ స్థలాన్ని అమ్మి మరీ బరిలో దిగడంతో ఆ అభ్యర్థి విజయంపై అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.
సర్పంచి అభ్యర్థి ఆత్మహత్య :తొలి విడత పంచాయతీ పోరులో ప్రచారం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెరలేవనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సోమవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో ఓ అభ్యర్థి నగదు, మద్యం పంచడం తన వల్ల కాదంటూ ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
తప్పటడుగులు వేయాల్సి వస్తుంది :ఇజ్జత్ కా సవాల్ అంటూ డబ్బులు ఖర్చు పెట్టడం, ఓడిన తరువాత బాధపడటం వద్దని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఆస్తులు అమ్మి అప్పులు చేసి నోట్లు పంచితే అర్థిక సమస్యల్లో చిక్కుకోవడంతో పాటు ఊరి సమస్యలు తీర్చడంలోనూ తప్పటడుగులు వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు