తగ్గుముఖం పట్టిన సాగు విస్తీర్ణం..
వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు..
ఎండిపోతున్న బోర్లు బావులు.
తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇంకా ప్రారంభం కాని దున్నకాలు : రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం పంటల సాగును వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన ఓ మోస్తరు వానలతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. కానీ అన్ని ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు కురవడం లేదు. ఆడపాదడపా కురుస్తున్న వర్షాలు పత్తి పంటకు జీవం పోస్తున్నాయి. 25 రోజుల క్రితం వరి నార్లు పోసుకున్న రైతులు, జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకొని నెల రోజులు కావస్తున్నా, ఆశించిన మేర వర్షాలు కురవకపోవటంతో దున్నకాలను ప్రారంభించ లేదు.
తగ్గుముఖం పట్టిన సాగు విస్తీర్ణం : సకాలంలో వర్షాలు కురిసి ఉంటే ఇప్పటికే వరి నాట్లు జోరుగా సాగేవి. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే వస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు నెల క్రితమే వరి నార్లు పోసుకున్నారు. వరి నాటు దశకు చేరుకున్న తరుణంలోనూ ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో రైతులు దున్నకాల పనులు ప్రారంభించలేదు. వరి, పత్తి, కంది, పెసర పంటల సాగు విస్తీర్ణం పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది.
నీరు లేక బోర్లు, బావులు వేలవేల : రాష్ట్రంలో గత రెండేళ్ల కాలంలో ఆశించిన మేర వర్షపాతం లేకపోవడం, వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో నీటి వినియోగం బాగా పెరిగింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. మే చివరి వారంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడంతో రైతులు సంబురపడి సాగుకు సిద్ధమయ్యారు. జూన్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు అనుకున్నంత మేర వర్షాలు కురవలేదు. దీంతో వరి, పత్తి, ఇతర పంటలను అంతంత మాత్రంగానే వేశారు.
వానకాలం ఎంత త్వరగా విత్తనాలు వేస్తే అంత మంచిదని.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా పంట చేతికి వస్తుందని రైతుల నమ్మకం! అయితే మేలో వర్షాలు పడడంతో రైతుల్లో సంబురపడ్డారు. ఈ నెల మొదటి నుంచి అంటే.. పదిహేను రోజుల క్రితం నుంచే దుక్కులు దున్ని సాగు ప్రారంభించారు. పత్తి విత్తనాలు వేశారు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో విత్తనాలు నాటిన రైతులు, ఇప్పటికే విత్తనాలు, దుక్కిదున్నినవి, కూలీల ఖర్చులు కలిపి దాదాపు ఎకరానికి సుమారు 12వేల వరకు పెట్టారు. ఇప్పుడు వరుణుడి జాడ కోసం ఎదురు చూస్తున్నారు. మొలకెత్తిన విత్తనాలను కాపాడుకోలేక తండ్లాతున్నారు. నీళ్లు లేక మొలక భూమిలోనే ఎండిపోతుండగా కంటతడి పెడుతున్నారు. విత్తనాలు మొలకెత్తని చోట మరోసారి నాటాల్సి వస్తుందని చెబుతున్నారు. బోర్లు, బావులు ఉన్న చోట కొందరు విత్తనాలకు నీరు అందిస్తున్నప్పటికీ, ఆ సౌకర్యం లేని చోట వర్షం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇటు రోహిణి కార్తెలోనే కొందరు అన్నదాతలు నార్లు పోశారు.