అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ భక్తుడి హత్య..!

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు హత్యకు గురయ్యాడు. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ (32) అనే వ్యక్తి శుక్రవారం వేకువజామున గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతడిని ఢీకొట్టారు. దీంతో కిందపడిపోయిన విద్యాసాగర్ యువకులతో వాగ్వాదానికి దిగారు.

తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ను తోటి భక్తులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి నిందితులు తిరువణ్ణామలైకి చెందిన గుగనేశ్వరన్ (22), తమిళరసన్ (25) అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

తిరువణ్ణామలై క్షేత్రం విశిష్టత : ఈ క్షేత్రాన్ని అన్నామలై లేదా అరుణాచలం అని పిలుస్తారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అంటే పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. దీన్ని తమిళంలో తిరువణ్ణామలై అంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణం ఎంతో విశిష్టత కూడుకున్నది. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు ఆ శివుడికి ప్రదక్షిణం చేసినట్లు అని భక్తులు విశ్వసిస్తారు. ఈ శైవ క్షేత్రం ప్రాముఖ్యత గురించి రమణ మహర్షి పదే పదే తెలిపేవారు. ఇక్కడ నిత్యం వేల మంది భక్తులు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం చేస్తారు. ఇక్కడే రమణాశ్రమం ఉంటుంది.

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959