సైనికుల దుస్తుల్లో టెర్రరిస్టులు… ఆందోళనలో కాశ్మీరీలు…!.

ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉగ్రవాదుల ముప్పుతో వణికిపోతున్న జమ్మూకశ్మీర్కు మరిన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి.. పహల్గాం ఉగ్రదాడితో వణికిపోయిన జమ్మూకశ్మీర్‌ ప్రజలను ఇప్పుడు మరో సమస్య వెంటాడుతోంది. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతోంది..భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు. అటు భద్రతా సిబ్బందికి ఉన్న ముప్పును పసిగట్టడంలోనూ ఇబ్బంది ఎదురవుతోంది. పహల్గాం దాడి నాటి నుంచి ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరంగా మారింది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు సైనిక దుస్తుల్లో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించినట్లు సమాచారం..

ముష్కరులను పాక్‌ అప్పగించాల్సిందే..

టెల్‌ అవీవ్‌: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్‌ పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ విజయవంతంగా ”ఆపరేషన్‌ సిందూర్‌” నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత రాయబారి మాట్లాడుతూ.. అమెరికా తరహాలోనే పాకిస్థాన్‌ కూడా ఉగ్రవాదులను అప్పగించాలన్నారు. ఒక ఇజ్రాయెలీ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌ పాక్‌కు నీటిని అందిస్తే.. వారు మా దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని భారత ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేశాం’ అని సింగ్‌ పేర్కొన్నారు.

సిందూర్‌ చిత్రాలు షేర్‌ చేసిన సైన్యం

దిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నిర్వహణలో మన సైన్యానికి చెందిన త్రివిధ దళాలు ఎంతో సమన్వయంతో వ్యవహరించాయి. కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మన బలగాలు ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేస్తున్నాయి. తాజాగా భారత వాయుసేన కూడా ఆ తరహా వీడియోను పంచుకుంది. ”ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో స్పందిస్తాం” అంటూ తన సంసిద్ధత, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. వైమానిక దళ విన్యాసాలు, కమాండర్ల శీఘ్ర ప్రతిస్పందన ఎలా ఉంటుందో అందులో చూపించారు.

పాక్‌ కలుగులోకి దూరాల్సిందే

‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతిగా పాకిస్థాన్‌ పాల్పడిన దుస్సాహసాన్ని భారత్‌ గట్టిగా తిప్పికొట్టింది. శత్రు దేశ డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంతో పాటు వారి కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్‌ తలచుకుంటే పాక్‌ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం మనకు ఉంది’ అని ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుమేర్‌ ఇవాన్‌ డి కున్యా పేర్కొన్నారు. అదే జరిగితే దాయాది ఏదైనా కలుగు వెతుక్కుని అందులో దాక్కోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దాయాదిపై విమర్శలు గుప్పించారు..