రైళ్లు వెళ్లాల్సిన పటాలపై ఓ యువతి వినూత్న రీతిలో పట్టాలపై నుంచి కారు నడుపుతూ హల్చల్ చేసింది. ఈ సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది..రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున 6 గంటలకు కొండకల్ రైల్వే గేట్ నుంచి బుల్కాపూర్ చిన్న శంకర్పల్లి మీదుగా శంకరపల్లి రైల్వే స్టేషన్ వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే పట్టాలపైనే కారు నడిపి తీవ్ర సంచలనం రేపింది. ఆమె నిర్వాకంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన రైల్వే గేట్మెన్ శంకర్పల్లి స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించగా స్టేషన్ మాస్టర్ ఆ ట్రాక్ గుండా వెళ్లే రైలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చాకచక్యంగా పట్టాలను క్రాసింగ్ చేయడంతో కారు శంకర్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చి ఆగిపోయింది. కారు అద్దాలను పగలగొట్టి యువతిని అదుపులోకి తీసుకొని పట్టాలపై ఉన్న కారును ప క్కకు తోసివేశారు. రెండు గంటల పాటు సాగిన ఈ హైడ్రామాకు స్థిరపడటంతో శంకర్పల్లి పోలీసులతో పాటు రైల్వే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
లక్నో నగరానికి చెందిన యువతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరానికి చెందిన విజయలక్ష్మి సుధీర్ కుమార్ ల కూతురు ఓమికా సోని (34) నగరంలోని పుప్పాలగూడలో గల హిల్ క్రిస్ట్ అపార్ట్మెంట్లో 2019 సంవత్సరం నుంచి ఉంటుంది. ఆమె క్యాప్ జెమినీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ సుమారు నెలకు రూ. 1.50 లక్షలు సంపాదిస్తూ జీవించేది. అయితే ఆమెకు 2022 సంవత్సరంలో భర్తతో విడాకులు కాగా అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తుంది. మూడు నెలల క్రితం ఉద్యోగం పోవడంతో ఆమె ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉందని సమాచారం. రెండు నెలల నుంచి తమతో సైతం ఫోన్లో కూడా మాట్లాడకుండా మతిభ్రమించినట్లు వ్యవహరిస్తుందని తల్లిదండ్రులు వాపోయారు. అయితే ఆమె గురువారం తెల్లవారుజామున తన కియా సోనేట్ (టీ ఎస్ 07కే బీ 1604) నెంబర్ గల కారులో రింగ్ రోడ్డు పైనుంచి నాగులపల్లి మీదుగా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామానికి ఉదయం 6:50 కి వచ్చింది. కొండకల్ రైల్వే గేటు వద్ద కారుతో వెళ్తున్నా ఆమె కారును రైలు పట్టాలు ఎక్కించి శంకర్పల్లి రైల్వే స్టేషన్ సమీపం వరకు రాగా అప్పటికే సమాచారం అందుకున్న రైల్వే అధికారులు పట్టాలను క్రాసింగ్ చేయగా కారు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఈ క్రమంలో ఆమె తన వద్ద ఉన్న నాన్ చాక్ చూపుతూ బెదిరించింది. ఆమె స్వతహాగా మారథాన్ రన్నర్ కావడం బలిష్టంగా ఉండటంతో అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అపసోపాలు పడ్డారు. పోలీసులు రైల్వే అధికారులు ఆమె చేతులకు టవల్తో కట్టివేసి శంకరపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆమెను విచారించిన శంకర్పల్లి పోలీసులు
కారులో వచ్చిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమెను కొద్దిసేపు విచారించగా ఎలాంటి వివరాలు తెలపలేదు. తండ్రి ఫోన్ నెంబర్లు మాత్రం పోలీసులకు తెలపడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి వివరాలు సేకరించారు. తదనంతరం ఆమెను చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వైద్యానికి సహకరించని యువతి
అదుపులోకి తీసుకున్న యువతి చికిత్స నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించగా ఆమె వైద్యం చేయడానికి సహకరించకపోవడంతో పోలీసులు ఆమెను ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తర నించారు. ఈ విషయమై నాంపల్లి రైల్వే సీఐ శ్రీనివాసులు వివరణ కోరగా ఓమికా సోని ఆత్మహత్య చేసుకోవడానికి కాలుతో రైల్వే ట్రాక్ పైకి వెళ్లిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులను దుర్భాషలాడినందున భూమికాసోనిపై శంకర్పల్లి పోలీసులు మరో కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
నిలిచిపోయిన పలు రైళ్లు – ఇబ్బందుల్లో ప్రయాణికులు
రైల్వే ట్రాక్ పై కారులో యువతి హల్చల్ చేయడంతో రైల్వే అధికారులు హైదరాబాద్ నుంచి వికారాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే పలు రైళ్లను నిలిపివేశారు. వికారాబాద్ నుండి శంకర్పల్లి మీదుగా నగరానికి వెళ్లే గూడ్స్ రైళ్లు, చిత్తాపూర్ సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, బీదర్ హైదరాబాద్ ప్యాసింజర్ రైలు, హైదరాబాద్ వైపు నుంచి శంకర్పల్లి మీదుగా వికారాబాద్ వైపు వెళ్లే నాందేడ్ -రాయచూర్, ఫలక్ నుమా వాడి ప్యాసింజర్ రైళ్ళను రైల్వే అధికారులు నిలిపివేశారు. దీంతో వివిధ పనుల నిమిత్తం వికారాబాద్ తాండూరు వైపు, బీదర్ వైపు, లింగంపల్లి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పట్టాలపై కారులో యువతి
https://x.com/Shireesh__/status/1938066461697700206?t=_jHuBwFa05DVHaOinD6ErQ&s=19
శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో యువతి పట్టాలపై నడుపుకుంటూ వెళ్లిందన్న సోషల్ మీడియా ఇతర పలు టీవీలలో వార్తలు రాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పట్టాలపై రైలు వెళ్తాయని విషయం అందరికీ తెలిసినప్పటికీ పట్టాలపై కారు కూడా వెళ్తుందనే నిజాన్ని ఆ యువతి అందరికీ తెలియజేప్పలా చేయడం పలువురికి విస్మయం కలిగిస్తోంది…