ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు..కోపంతో అన్ని దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన..
ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ మరింత రెచ్చిపోయారు. ధర్మానసం తీర్పుపై కోపంతో అన్ని దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ అదనపు సుంకాలు దాదాపు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత్ కూడా ఆ 10శాతం సుంకాలు చెల్లించాల్సిందే అని వైట్‌హౌస్ పేర్కొంది.
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుందని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. భారత్ 10 శాతం టారిఫ్ చెల్లించాలా? అలాగే ఇది గతంలో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమీక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) కింద విధించిన టారిఫ్‌లను భర్తీ చేస్తారా అని ప్రశ్నకు వైట్‌హౌస్ అధికారి ఈ మేరకు స్పందించారు. మరో చట్టపరమైన ఉత్తర్వులు అమల్లోకి వచ్చే వరకు 10 శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా, అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్ అనేది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన రక్షణాత్మక వాణిజ్య విధానంలో భాగమని పేర్కొన్నారు. చెల్లింపుల సమతుల్యత లోటును తగ్గించడం, అన్యాయ వాణిజ్య విధానాలను పరిష్కరించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.మరోవైపు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కొనుగోళ్లను భారత్ తన అభ్యర్థన మేరకు గణనీయంగా తగ్గించిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌తో తనకు అద్భుతమైన సంబంధం ఉందని తెలిపారు. వైట్‌హౌస్‌లో అమెరికా సుప్రీంకోర్టు తను విధించిన టారిఫ్‌లను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.