అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వంపై మరోసారి కీలక చర్యలకు దిగారు. అమెరికాలో జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే విధానాన్ని పరిమితం చేసే లక్ష్యంతో రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు. ముఖ్యంగా ‘బర్త్ టూరిజం’ను అడ్డుకోవడమే ఈ ఆదేశాల ప్రధాన ఉద్దేశంగా అమెరికా ప్రభుత్వం చెబుతోంది.
ఈ కొత్త ఆదేశాల ప్రకారం.. విదేశీ ప్రభుత్వాల తరఫున పనిచేసే కొందరు వ్యక్తులు, కొన్ని విదేశీ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు, అలాగే అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశపూర్వకంగా వీసా నిబంధనలను దుర్వినియోగం చేసిన సందర్భాల్లో మినహాయింపులు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఆదేశాల చట్టబద్ధతపై ఇప్పటికే తీవ్ర న్యాయపరమైన వివాదం నెలకొంది.
ఇదిలా ఉండగా, గత నెలలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గతంలో జారీ చేసిన జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించిన దాదాపు అందరికీ జన్మతః పౌరసత్వం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ట్రంప్ ప్రభుత్వం మరో మార్గంలో జన్మతః పౌరసత్వ పరిధిని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. కొత్త ఆదేశాలు నేరుగా అన్ని విదేశీయుల పిల్లలకు పౌరసత్వాన్ని నిలిపివేయడం కాకుండా, కొన్ని ప్రత్యేక పరిస్థితులను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఈ పరిణామం అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాల్లోనూ ఆసక్తి, ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే భారతీయ కుటుంబాలకు కొత్త నిబంధనలు ఎలా వర్తిస్తాయన్నది కీలకంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ ఆదేశాల పూర్తి ప్రభావం, అమలు విధానం న్యాయపరమైన సవాళ్లపై ఆధారపడి ఉంటుంది.
ట్రంప్ తాజా నిర్ణయాలను న్యాయపరంగా సవాలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే జన్మతః పౌరసత్వానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులను బలపరిచిన నేపథ్యంలో.. కొత్త ఆదేశాలు కోర్టుల్లో ఎంతవరకు నిలబడతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.