సరూర్నగర్ స్టేడియం వద్ద తోపులాట.. హైడ్రా ఉద్యోగాల కోసం భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియం వద్ద భారీగా నిరుద్యోగులు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో స్టేడియం వద్ద తోపులాట చోటుచేసుకుంది.
హైడ్రా పరిధిలో DRF అసిస్టెంట్ డ్రైవర్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సరూర్నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ఉంటుందని హైడ్రా ప్రకటించింది.
ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు పలు శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 800 మీటర్ల పరుగును 170 సెకన్లలో, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయడంతో పాటు.. 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కిలోల షాట్పుట్ను 6 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు ఒకేసారి స్టేడియం వద్దకు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. అభ్యర్థుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సరూర్నగర్ స్టేడియం పరిసరాల్లో భారీగా రద్దీ ఏర్పడింది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎంపిక ప్రక్రియ నిర్వహణపై కూడా ఆసక్తి నెలకొంది.