అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ.. ట్రంప్‌తో భేటీపై అందరి దృష్టి..!

అమెరికా అధ్యక్షుడు జనవరి 20న రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా డోనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి, ఎన్ఎస్ఏ మైఖేల్ వాల్ట్జ్‌లను కూడా కలవనున్నారు…ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటన విజయవంతమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ చేరుకున్న ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి అతిథి గృహంలో భారతీయ-అమెరికన్ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు….డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చినట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్ కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమని ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్ చేరుకున్న వెంటనే, డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని కౌగిలించుకుని స్వాగతం పలికారు. దీని తరువాత, ఇద్దరు నాయకులు వైట్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీని ట్రంప్ చాలా ప్రశంసించారు. దీనికి ప్రధాని మోదీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికైనందుకు ట్రంప్‌ను ఆయన అభినందించారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున కూడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు..

ప్రధాని మోడీ తన అమెరికా పర్యటనను ఇప్పటికే అమెరికా జాతీయ నిఘా విభాగ అధ్యక్షులు తులసి గబ్బర్డ్‌తో సమావేశంతో ప్రారంభించారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలు చర్చించారు. ఉగ్రవాదం, ఉద్భవిస్తున్న ముప్పులను ఎదుర్కోవడంలో నిఘా సహకారాన్ని పెంచడంపై ఇద్దరు నాయకుల మధ్య భేటీలో ప్రధాన చర్చకు వచ్చినట్టు తెలిసింది…గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇస్తున్న నాల్గవ విదేశీ నేత ప్రధాని నరేంద్ర మోదీ. డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలం ప్రారంభమైన ఒక నెలలోపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా, జోర్డాన్ రాజు అబ్దుల్లాII లకు వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు..