ఉద్రిక్తతలకు తెరదించని పక్షంలో వాణిజ్యం నిలిపేస్తామంటూ భారత్‌, పాకిస్థాన్‌లకు చెప్పెను.. ట్రంప్..

ఉద్రిక్తతలకు తెరదించని పక్షంలో వాణిజ్యం నిలిపేస్తామంటూ భారత్‌, పాకిస్థాన్‌లకు చెప్పామని.. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల్ని భారత్‌ తిప్పికొట్టింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతున్న సమయంలో ఆయా సందర్భాల్లో అమెరికా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఫోన్‌లో మాట్లాడారని.. ఎక్కడ కూడా వాణిజ్యం గురించి ప్రస్తావన రాలేదని స్పష్టం చేసింది.
‘‘ఆపరేషన్‌ సిందూర్‌పై మే 9న ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాట్లాడారు. అగ్రరాజ్య విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో మే 8, 10వ తేదీల్లో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో చర్చలు జరిపారు. అదేవిధంగా మే 10న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తోనూ మాట్లాడారు. ఏ సందర్భంలోనూ ఇరుదేశాల మధ్య వాణిజ్య అంశం ప్రస్తావనకు రాలేదు. కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు’’ అని అధికార వర్గాలు తెలిపాయి.‘‘భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు మా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది. వాణిజ్యం విషయంలోనూ మేం అండగా ఉన్నాం. ‘ఉద్రిక్తతలకు ముగింపు పలికితేనే వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం. లేకపోతే.. ఎటువంటి వాణిజ్యం చేయబోం’ అని స్పష్టం చేశాం. దీంతో ఆ రెండు దేశాలు సానుకూలంగా స్పందించాయి’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీన్ని భారత్‌ తాజాగా ఖండించింది. అంతకుముందు కాల్పుల విరమణపైనా ట్రంప్‌ తొలుత ప్రకటన చేయగా.. భారత్‌ మాత్రం ట్రంప్‌ పాత్రను ప్రస్తావించలేదు..