రాష్ట్ర సుభిక్షం కోసం ఘనంగా ముగిసిన వరుణ యాగం.. సీఎం రేవంత్ రెడ్డి.

రాష్ట్ర సుభిక్షం కోసం ఘనంగా ముగిసిన వరుణ యాగం..

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వరుణ యాగం అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసింది.
నాగార్జునసాగర్‌ ఒడ్డున యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో వరుణ యాగాన్ని నిర్వహించారు. యాగం చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి సమర్పించిన సీఎం దంపతులు.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు జలకళను సంతరించుకోవాలని ప్రార్థించారు..

చెరువులు, జలాశయాలు నిండాలని, సాగునీటి ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు చేరాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రైతన్నల కష్టానికి తగిన ఫలితం దక్కి, ప్రతి కుటుంబం సంతోషంగా, సుభిక్షంగా జీవించాలని కోరుకున్నారు..

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం పడకుండా.. కరువు పరిస్థితులు తలెత్తకుండా విస్తారంగా వర్షాలు కురిసి రైతుల మోముల్లో చిరునవ్వులు వెల్లివిరియాలనే సదుద్దేశంతో ఈ వరుణ యాగాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది..

ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సే ప్రజా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.